మట్టి తరలించిన వారిపై చర్యలేవీ?
ఓబులవారిపల్లె : రాత్రికి రాత్రి పెద్ద ఎత్తున మట్టి తరలింపును నిలిపివేసి అధికారులు నివేదిక పంపినా ఇప్పటి వరకూ చర్యలకు ఉపక్రమించలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే మండలంలోని మంగంపేట ఏపీఎండీసీ కార్యలయం సమీపంలో పాత అయ్యపురెడ్డిపల్లె నందు మట్టి తరలింపు జోరందుకుంది. తమను అడ్డుకునే వారెవరంటూ ఏపీఎండీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు రెచ్చిపోయారు. ఏపీఎండీసీ ఘనులకు కూతవేటు దూరంలో ఉన్న స్థలంలో గత సెప్టెంబరులో టిప్పర్ల సాయంతో యథేచ్ఛగా మట్టి తరలించి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. కూటమి నాయకుల అండ ఉండడంతో అక్రమార్కులపై రెవెన్యూ అధికారులు, ఇటు ఏపీంఎడీసీ అధికారులు చర్యలు తీసుకోలేదు. ప్రతి పక్ష పార్టీ నేతలు తప్పులు చేశారంటూ పదే పదే గళం విప్పే నేతలు ఈ మట్టి తరలింపులపై ఎందుకు స్పందించడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులను విచారించి లక్షలాది రూపాయలు కొల్లగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. మంగంపేట ఏపీఎండీసీ సీపీఓ సుదర్శన్‌రెడ్డి వివరణ కోరగా అనుమతులు లేకుండా మట్టి తరలించిన విషయం వాస్తవమేనని, అందుకు కారణమైన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఏండీకి నివేదిక పంపామని తెలిపారు. ఇప్పటి వరకు చర్యలు తీసుకోమని తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment