జాతీయ స్థాయి బేస్‌బాల్ జట్టుకు ఎంపిక
రైల్వేకోడూరు అర్బన్ : జాతీయ స్థాయి బేస్‌బాల్ పోటీలకు తమ కళాశాల విద్యార్థి అరవింద్ ఎంపికై నట్లు ఎస్వీ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 14వ తేది నుంచి 17వ తేది వరకు గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన 68వ ఇంటర్ డిస్ట్రిక్ట్ రాష్ట్ర స్థాయి పోటీలలో తమ విద్యార్థి ప్రతిభ చూపారని తెలిపారు. అనంతరం అరవింద్‌ను అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించారు.
తీగల చోరీ.. పైపు ధ్వంసం
నిమ్మనపల్లె : గుర్తుతెలియని వ్యక్తులు కేసింగ్ పైపు ధ్వంసం చేసి, 60 మీటర్ల కేబుల్ తీగలు చోరీచేసిన సంఘటన నిమ్మనపల్లె మండలంలో జరిగింది. బాధిత రైతులు పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ముష్టురు పంచాయతీ యరప్ప్రగారిపల్లెకు చెందిన కృష్ణప్పగారి సహదేవ, పెదనాన్న కుమారుడు కె.వెంకటరమణ కలిసి గ్రామ సమీపంలోని భూమిలో బోరు వేసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఇటీవల పొలంలో బావికి, బోరుకు సంబంధించిన స్టార్టర్లు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి పొలం వద్ద ఎవరూలేని సమయంలో బోరు కేసింగ్, పైపులైన్ గేట్ వాల్వ్ పగలగొట్టి 60 మీటర్ల కేబుల్ తీగలు ఎత్తుకెళ్లారు. మోటారు తొలగించి బావిలో పడవేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ఎంహెచ్‌పీఎస్
జిల్లా అధ్యక్షురాలిగా హజీరా
రాయచోటి అర్బన్ : మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి(ఎంహెచ్‌పీఎస్) అన్నమయ్య జిల్లా అధ్యక్షురాలిగా హజీరా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. పట్టణంలోని ఎంహెచ్‌పీఎస్ కార్యాలయంలో బుధవారం జిల్లా మహిళా విభాగం సమావేశం జరిగింది. సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.సగీర్, ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడు ఖాదర్‌బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఎస్.నాగజ్యోతి, సభ్యులుగా షబానా, ఫర్జానా, హస్నా, యాస్మిన్, సోఫియా, రాయచోటి పట్టణ ఉపాధ్యక్షురాలిగా షేక్ దిల్షాద్ ఎంపిక య్యారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్‌పీఎస్ రాయలసీమ యూత్ కన్వీనర్ ఇమ్రాన్ అలీ, జిల్లా ఉపాధ్యక్షుడు అష్రఫ్, బీసీ సెల్ ఉపాధ్యక్షుడు మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.
బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
జమ్మలమడుగు రూరల్ : బైక్ మరమ్మతులు చేసుకుని వెళ్తుండగా అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. జమ్మలమడుగు మండలపరిధిలోని పి. బోమ్మేపల్లి గ్రామంలోని తండాకు చెందిన మూడే నారాయణ నాయక్(34) జమ్మలమడుగుకు వచ్చారు. బైక్ మరమ్మతు చేయించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో జమ్మలమడుగు పరిధిలోని రోజా టవర్స్ వద్ద బైక్ అదుపు తప్పి కింద పడిపోయారు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment