ఉరుసు ఉత్సవాల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
మదనపల్లె : పెద్దమండ్యం మండలం కలిచెర్ల మౌలాకాపహాడ్ ఉరుసు ఉత్సవాల నిర్వహణలో చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ హెచ్చరించారు. బుధవారం సాయంత్రం సబ్‌కలెక్టరేట్‌లో కడప అమీన్‌పీర్ దర్గా, కలిచెర్ల మౌలాకా పహాడ్ పీఠాధిపతి ఆరీపుల్లా హుస్సేని, హైదరాబాద్‌కు చెందిన అన్సారుల్ హక్ వర్గాలకు చెందిన వారితో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్సారుల్ హక్ వర్గం ఈనెల 26, 27, 28 తేదీల్లో కలిచెర్లలో ఉరుసు ఉత్సవాల నిర్వహణకు ప్రయత్నిస్తున్నారని ఆరీపుల్లా హుస్సేని ఆరోపించారు. ఈ దర్గాపై సర్వహక్కులు కలిగిన వారే ఉరుసు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అన్సరుల్‌హక్ మాట్లాడుతూ... తమ తాత, ముత్తాతల నుంచి దర్గాపై తమకు హక్కులు ఉన్నాయని, తామే ఉరుసు నిర్వహిస్తామన్నారు. దీనిపై సబ్ కలెక్టర్ మాట్లాడుతూ....ఇరువర్గాలు వారి వద్ద ఉన్న దర్గా డాక్యుమెంట్స్ తీసుకురావాలని, వాటిని పరిశీలించాకే దర్గా ఉరుసు ఉత్సవాలకు అనుమతిస్తామన్నారు. డీఎస్పీ కొండయ్య మాట్లాడుతూ... అనుమతి లేకుండా కలిచెర్ల ఉరుసు ఉత్సవాలకు ఏర్పాట్లు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదుచేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. అంతవరకు కలిచెర్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించాలని పెద్దమండ్యం పోలీసులను ఆదేశించారు.
సబ్ కలెక్టర్ మేఘస్వరూప్
Comments
Please login to add a commentAdd a comment