విద్యుత్తు అధికారుల మొద్దు నిద్ర
స్పిన్నింగ్ మిల్లు విక్రయించిన ఏడాదికి నోటీసులు
మదనపల్లె : ఏపీఎస్పీడీసీఎల్ అధికారుల మొద్దునిద్ర వీడటం లేదు. కాలగర్భంలో కలిసి పోయిన మదనపల్లె స్పిన్నింగ్ మిల్లు విక్రయం జరిగిపోయి, యంత్రాలు, సామగ్రి తరలించేసి, పూర్తిగా స్థలాన్ని చదును చేసేశాక... బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు గోడకు అతికించడం ఇందుకు అద్దం పడుతోంది. ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు స్పిన్నింగ్ మిల్లు నుంచి సంస్థకు హెచ్‌టీఎస్‌సీ నెం.టీపీటీ 235 కింద రూ.9.08 కోట్ల బకాయిలు చెల్లించాలని ఏపీఎస్పీడీసీఎల్ రాయచోటి అకౌంట్స్ ఆఫీసర్ బ్రహ్మయ్యచారి, మదనపల్లె ఆపరేషన్ ఈఈ ఎం.గంగాధరం, డిప్యూటీ ఈఈ బి.రురేంద్ర నాయక్, రూరల్ ఏఈ కే.రమేష్ తదితరులు వెళ్లి బకాయి నోటీసు గోడకు అతికించారు. సీటీఎం స్పిన్నింగ్ మిల్లు లాకౌట్ తర్వాత యాజమాన్యం మిల్లును బహిరంగ వేలం ద్వారా విక్రయించారు. ఇప్పటికే ఈ స్థలం ఇద్దరు వ్యక్తుల చేతులు మారినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీఎస్పీడీసీఎల్ సంస్థకు రావాల్సిన బకాయి మొత్తం ఎవరు చెల్లించాలనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈఈ గంగాధరం వివరణ కోరితే... ఇప్పటికే తమ సంస్థ స్పిన్నింగ్ మిల్లు యాజమాన్యానికి నోటీసులు జారీచేసిందని, లావాదేవీల విషయమై కోర్టులో కేసు నడుస్తుండటంతో బకాయి వసూలుకు ఆలస్యమైందని తెలిపారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ 1864 కింద ఏపీఎస్పీడీసీఎల్‌కు రావాల్సిన బకాయిలను వడ్డీతో కలిపి వసూలుచేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment