పెద్దతిప్పసముద్రం : హైకోర్టు ఆదేశాలతో అధికారులు వెనక్కి తగ్గారు. పెద్దతిప్పసముద్రం మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 19న మండల్ మీట్ జరగాల్సి ఉండగా హైకోర్టు ఆదేశానుసారం అధికారులు రద్దు చేశారు. గతంలో ఇక్కడ ఎంపీడీఓగా బ్రహ్మానందరెడ్డి పని చేసే సమయంలో ఎంపీపీ అనుమతితో మండల్ మీట్ నిర్వహణకు అధికారులు సంసిద్ధమయ్యారు. అయితే సమావేశం నిర్వహించేందుకు ఎంపీపీతో పాటు సభ్యులు పూర్తి స్థాయిలో హాజరై కోరం ఉన్నప్పటికీ కూటమి నాయకులు ఉద్దేశపూర్వకంగా అధికారులను కార్యాలయం లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీఓ ప్రకటించారు. సదరు ఎంపీడీఓ బదిలీ అనంతరం కొత్తగా వచ్చిన కేఎన్ బాలాజీ ఎంపీపీ అనుమతి లేకుండా మండల్ మీట్ తేదీని ప్రకటించగా సభ్యులు ఎవరూ హాజరు కానందున కోరం లేక వాయిదా వేశారు. తరువాత అధికారుల ఏకపక్ష ధోరణిని వివరిస్తూ ఎంపీపీతో పాటు పలువురు రాయచోటికి వెళ్లి సమావేశం నిర్వహణకు సహకరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఎంపీడీఓ అబ్దుల్ కలాం ఆజాద్ మండల మీట్‌కు తేదీ ఇవ్వాలని ఇటీవల ఎంపీపీ మహమూద్‌ను కోరగా ఈ వ్యవహారంపై హైకోర్టులో కేసు నడుస్తోందని తాను ఎలాంటి తేదీ ఇవ్వలేనని చెప్పారు. 90 రోజుల్లో ఎలాగైనా మీటింగ్ జరపాలనే ఉద్దేశంతో ఎంపీడీఓ ఈ నెల 19న జరిగే మండల మీట్‌కు హాజరు కావాలని సర్క్యులర్లు ఇవ్వగా వాటిని తీసుకునేందుకు పలువురు సభ్యులు నిరాకరించారు. దీంతో అధికారులు సర్క్యులర్ ప్రతులను రిజిస్టర్ పోస్టు ద్వారా సభ్యులకు పంపారు. ఈ తరుణంలో ఈ నెల 18న వారం రోజుల్లో మండల మీట్ జరపాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు 19న జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేశారు. అయితే గతంలో మండల మీట్ వాయిదా పడిన మూడు సార్లు మండల పరిషత్ కార్యాలయం వద్ద కూటమి నాయకులు పోలీసుల సమక్షంలోనే కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఊగిపోతూ నానా హంగామా చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం తీర్పుకు అనుగుణంగా సభ్యులకు పోలీస్ భద్రత కల్పిస్తూ శాంతి భద్రతల నడుమ మండల మీట్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తారా, లేదా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సమావేశాన్ని వాయిదా వేస్తారో వేచి చూడాల్సి ఉంది.
మండల మీట్ నిర్వహణపై ఉత్కంఠ
Comments
Please login to add a commentAdd a comment