మండల సర్వేయర్‌పై కడప ఆర్డీఓ ఆగ్రహం
ఒంటిమిట్ట : ప్రభుత్వం తమకు కేటాయించిన భూములను చూపించాలని బాధితులు ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించగా అందుకు సంబంధించిన భూములు ఇంతవరకు ఎందుకు చూపించలేదు, ఆ భూములు ఎక్కడ ఉన్నాయని మండల సర్వేయర్ ప్రియాంకపై ఆర్డీఓ జాన్ ఇర్విన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల పరిధిలోని పెన్న పేరూరు గ్రామంలో తహసీల్దార్ వెంకటరమణ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, రాజంపేట నియోజకవర్గం టీడీపీ నాయకుడు సుగవాసి బాలసుబ్రమణ్యం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమ భూములు తమకు చూపించాలంటూ బాధితులు కోరగా దీంతో వారు సర్వేయర్ ప్రియాంకను వారి భూములు మ్యాప్‌లో ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. ప్రియాంక తడబడటంతో మీ ప్రాంతంలోని భూములు ఎక్కడ ఉన్నాయో మీకే తెలియకపోతే ఏం పని చేస్తున్నారని ఆర్డీఓ సర్వేయర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సమక్షంలో సదస్సును నిర్వహించేటప్పుడు పూర్తి సమాచారంతో సదస్సుకు హాజరు కావాలన్నారు. అనంతరం సోమశిల వెనుక జలాలతో పెన్నపేరూరులో ముంపునకు గురవుతున్న తమ ఇళ్లకు పరిహారం ఇప్పించాలని ఆర్డీఓకు గ్రామ ప్రజలు విన్నవించుకున్నారు. ఇందుకు స్పందించిన ఆర్డీఓ ముంపు ప్రాంతాన్ని పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట రెవెన్యూ ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు, మండల స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మయ్య, మండల తహసీల్దార్ రమణమ్మ, ఇతర రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment