టమాటా ధర ఢమాల్!
రాయచోటి : నిన్న మొన్నటి వరకు రూ.60–రూ.70 ఓ దశలో రూ.100కు చేరువైన కిలో టమాటా ఇప్పుడు వ్యవసాయ మార్కెట్లలో కనీస ధరలకు కూడా కొనడం లేదు. అన్నమయ్య జిల్లాలోని మార్కెట్లకు మదనపల్లి, గుర్రంకొండ, వాయల్పాడు, కలకడ, రాయచోటి మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున టమాటా విక్రయాలు జరుగుతుంటాయి. మూడు నెలల క్రితం అకాల వర్షాలతో పంటలు నష్టపోవడంతో ధరలు అమాంతం పెరిగాయి. కొత్త పంట చేతికి వచ్చే సరికి ధరలు పడిపోయాయి. దీంతో రైతులు ఈ ధరలను చూసి అక్కడే కుప్పకూలిపోతున్నారు. వ్యవసాయ, కూరగాయల మార్కెట్లలో టమాటా, మిర్చి ధరలు 10 రోజుల నుంచి ఒక్కసారిగా పడిపోయాయి. 15 కిలోల టమాటా బాక్స్ టాప్ రకం వంద నుంచి రూ.130 ధరకు కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఇక రెండో రకం కాయలు 30 నుంచి 100 రూపాయలలోపే పలుకుతున్నాయి. టమాటా పంట సాగు కోసం లక్షలాది రూపాయలు పెట్టిన పెట్టుబడి ముందు మార్కెట్ ధరలు కుళ్లిన వాసనను తలపిస్తున్నాయి.
దళారుల దోపిడీ..
కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తరలిస్తే అక్కడ దళారుల దోపిడీకి రైతులు బలవుతున్నారు. నాణ్యత ఉన్న పంటకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మార్కెట్లో వ్యాపారులు కుమ్మకై ్క తక్కువ ధరలకు వేలం పాడుతుండటంపై రైతులు రగిలిపోతున్నారు. వ్యవసాయ మార్కెట్లోకి టమాటా కాయలు ఒక్కసారిగా రావడంతో ధరలు పడిపోయినట్లు మార్కెట్ దళారులు చెబుతున్నారు.
రైతు బజార్లలో..
జిల్లాలో పండించిన టమాటా రైతు బజార్లలో కిలో టమాటా ధర రూ.10 నుంచి రూ.15గా ఉంది. మదనపల్లి, గుర్రంకొండ, వాయల్పాడు, కలకడ, రాయచోటి మార్కెట్‌లలో నిత్యం 200 టన్నుల కొనుగోళ్లు జరుగుతాయి. మదనపల్లి, గుర్రంకొండ, వాయల్పాడు, కలకడలలో కొనుగోలు చేసిన వ్యాపారులు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో కూడా పంటలు అందుబాటులోకి రావడంతో జిల్లా నుంచి ఎగుమతి అయ్యే టమాటాకు డిమాండ్ తగ్గింది. దీంతో వ్యాపారులు ధర తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. ఆదివారం మార్కెట్లో కనీస ధరలు కూడా లేకుండా కొనడంపై రైతులు ఆగ్రహంతో టమాటాలను మార్కెట్లోనే పారబోసి వెళ్లిపోయారు. ఇలా వదిలేసిన టమాటా కాయలు పశువులకు ఆహారంగా మారాయి.
కూలీల ఖర్చులు రావడం లేదు..
మార్కెట్లో పలుకుతున్న ధరలతో కూలీలకు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని రైతులు వాపోతున్నారు. ఒక ఎకరంలో టమాటా పంటను సాగు చేయాలంటే రూ.2.5 నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటూ సాగు చేసిన టమాటా, ఇతర కూరగాయలకు మార్కెట్లో మద్దతు ధరలు లభించకపోవడంతో ఆర్థికంగా కుంగిపోవాల్సి వస్తోంది.
సాగుపై అవగాహన లేక..
పంటల సాగులో రైతులకు తగినంత అవగాహన లేకపోవడంతోనే మార్కెట్లో రైతు దివాలా తీస్తున్నారనే అభిప్రాయం ఉంది. మార్కెట్లో పలికిన ధరలను విన్న రైతులు అదే పంటను అధికంగా సాగు చేయడం ఈ దీనస్థితికి కారణం అని కొంతమంది చెబుతున్నారు. సంబంధిత వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు కూడా రైతు ఆర్థిక స్థితిగతులు పరిగణనలోకి తీసుకుని ఏఏ ప్రాంతాలలో ఏ పంటలు వేయాలి.. ఎన్నెన్ని హెక్టార్లలో సాగు చేయాలి అనే సమాచారంతో ప్రోత్సహిస్తే ఇలాంటి నష్టాలు ఉండవని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నా పేరు జాకీర్‌హుస్సేన్. రాయచోటి మార్కెట్‌లో కూరగాయల వ్యాపారిని. మార్కెట్లో పలుకుతున్న కూరగాయల ధరలను చూస్తే పంటలను సాగు చేసిన రైతుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. స్థానికంగా రైతుల నుంచి సేకరించిన కాయలను బయట ప్రాంతాలకు పంపుదామన్నా అక్కడ కూడా ధరలు పడిపోయినాయి. మన జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాలు, రాష్ట్రాలలో టమాటా సాగు ఎక్కువగా ఉంది. లారీలతో టమాటా, మిర్చి, వంకాయలు మార్కెట్‌కి వస్తున్నాయి. వాటిని ఎక్కడ విక్రయించాలో మాకు అర్థం కావడం లేదు. ఈ ధరలతో రైతులు భారీగా నష్టపోవాల్సిందే. సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని ధరలు అమాంతం పెరిగితే ఇప్పుడు సాగు అధికమై దిగుబడి గణనీయంగా పెరగడంతో కొనేవాళ్లు లేక పారబోయాల్సి వస్తోంది.
నా పేరు రామాంజులు. గాలివీడు సమీపంలోని వెలిగల్లు ప్రాజెక్టు దగ్గర ఎకరా భూమికి రూ.50 వేల వంతున గుత్త(కోరు) చెల్లించి 8 ఎకరాల్లో టమాటా, వంకాయ తోటలను సాగు చేశాను. టమాటా కాయలు యాపిల్ సైజులో ఉండి దిగుబడికొచ్చాయి. ధరలు అనుకూలించి మంచి లాభాలు వస్తాయని ఆశించా. టమాటా సాగుకు ఎకరం పొలానికి రూ.2.70 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు అయింది. గుత్తకు తీసుకున్న భూమిలో 4 ఎకరాలలో టమాటా మరో 4 ఎకరాలలో వంకాయ పంటలను సాగు చేశాను. కాయలను మార్కెట్‌కు తీసుకెళ్తే మార్కెట్లో పలుకుతున్న ధరల మాట వింటే గుండె గుభేల్‌మంటోంది. ఆపిల్ కాయల సైజులో మొదటి రకం కాయలు 30 కిలోల బాక్స్ రూ.250 నుంచి రూ.300 వరకు మాత్రమే పలుకుతోంది. వంకాయలు కిలో రూ.10 కంటే ఎక్కువ పలకడం లేదు. ఈ ధరలతో రవాణా ఖర్చులు, కూలీలు కూడా చెల్లించుకోలేని పరిస్థితి.
25 కిలోల బాక్స్ టాప్ రూ.130.. సాధారణం రూ.50 నుంచి రూ.100లోపే
పశువులకు ఆహారంగా మారిన టమాటా
దయనీయ స్థితిలో టమాటా రైతులు
Comments
Please login to add a commentAdd a comment