నువ్వా.. నేనా..!
సాక్షి టాస్క్‌ఫోర్స్ : పులివెందుల అంటేనే వైఎస్ కుటుంబానికి కంచుకోట. అలాంటి కంచుకోటలో పాగా వేయాలని టీడీపీ రాష్ట్ర నేతలు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ పరిస్థితి మరో విధంగా ఉంది. పులివెందుల టీడీపీ నేతల మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది. పులివెందులలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ప్రస్తుత ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి వర్గాలు ‘నువ్వా, నేనా’ అన్నట్లు తీవ్ర విభేదాలతో ప్రవర్థిస్తున్నారు. వివరాలలోకి వెళితే పులివెందుల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి యథేచ్చగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులు పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ప్రతి మండలంలోనూ తామే అంతా అన్నట్లుగా వ్యవహరిస్తూ పోలీసు, ఇతర అధికారులను విస్మరిస్తూ యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఉదాహరణకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోపే పులివెందులలో ఉన్న దాదాపు కోటి రూపాయల ఇసుక రీచ్‌ను బీటెక్ రవి అనుచరులు తరలించుకెళ్లడం జరిగింది. అంతేకాక ఇటీవల సంక్రాంతి పండుగ నేపథ్యంలో వేముల మండలంలోని దాదాపు రూ.15కోట్లు విలువ చేసే ముగ్గురాయిని రాత్రికి రాత్రే తరలించారు. అంతేకాక సంక్రాంతి పండుగ నేపథ్యంలో యథేచ్ఛగా ప్రతి మండలంలోనూ కోడి పందేలు, గ్యాంబ్లింగ్, గుండాట తదితర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించి లక్షలు సొమ్ము చేసుకున్నారని విమర్శలు ఉన్నాయి.
యథేచ్ఛగా గ్యాంబ్లింగ్
పులివెందుల నియోజకవర్గంలో యథేచ్ఛగా గ్యాంబ్లింగ్ జరుగుతోందని జగమెరిగిన సత్యం. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల వారి మధ్య విభేదాలు వచ్చి ఆ పంచాయతీ కూడా నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్ రవి వద్దకు చేరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పులివెందులలో మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్సీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ప్రస్తుత ఎమ్మెల్సీ పోలీసులపై గ్యాంబ్లింగ్ నిర్వహించకూడదని తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. గ్యాంబ్లింగ్ విషయంలో డివిజన్ పోలీసు అధికాారి, రూరల్ అధికారి నిరంతరం మామూళ్ల మత్తులో జోగుతున్నట్లు సమాచారం. వీరికి గ్యాంబ్లింగ్ ద్వారా ప్రతి నిత్యం మామూళ్లు అందుతున్నట్లు టీడీపీ కార్యకర్తలే చెబుతున్నారు. అయితే డివిజన్ పోలీసు అధికారి రూరల్ అధికారిలపై పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కేవలం గ్యాంబ్లింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వీరిరువురే పంచుకోవడంపట్ల మిగతా డిపార్ట్‌మెంట్ ఎస్‌ఐ, సీఐలు కానీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పలు ప్రాంతాలలో జూదం
పులివెందుల నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో మంగతాయి జూదం యథేచ్చగా సాగుతోంది. లింగాల మండలంలోని ఇప్పట్ల స్థోత్రీయం గుట్టలో మంగతాయి జూదం జరుగుతోంది. దీనికి ఆ మండల ఇన్‌ఛార్జి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. జూదం నిర్వహించేవారు కూడా మండల ఇన్‌చార్జి అనుచరులే కావడం గమనార్హం. ఇంతా జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అలాగే పులివెందుల పట్టణ పరిధిలోని కదిరి రోడ్డు, జెఎన్‌టీయూ వెనుక వైపు ఉన్న గుట్టలోనూ, తుమ్మలపల్లె గుట్టలోనూ, పెద్దరంగాపురం గుట్టలోనూ యథేచ్ఛగా జూదం జరుగుతోంది. అయితే పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. దీనికి ప్రధాన కారణం వారికి రోజు వచ్చే మామూళ్లేనని సమాచారం. ఇటీవల టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు జూదంపై ప్రెస్‌మీట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ నాయకుడు చెప్పినట్లుగా జూదం అరికట్టడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు.
పులివెందులలో మాజీ ఎమ్మెల్సీ,
ప్రస్తుత ఎమ్మెల్సీ మధ్య వర్గ విభేదాలు
అసాంఘిక కార్యకలాపాలకు
పాల్పడుతున్న మాజీ ఎమ్మెల్సీ వర్గీయులు
ఇటీవల రేషన్ డీలర్ల విషయంలోనూ దౌర్జన్యం చేసిన మాజీ ఎమ్మెల్సీ వర్గీయులు
అధిష్టాన వర్గానికి ఇరువురు నేతల ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment