హంద్రీనీవాకు సమాంతర కాలువ ప్రారంభించాలి
మదనపల్లె : హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని పదివేల క్యూసెక్కులకు పెంచి, కాలువ విస్తరణ పనులు తక్షణమే ప్రారంభించి సమాంతర కాలువ ప్రారంభించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య కోరారు. సీపీఐ ఆధ్వర్యంలో శనివారం సబ్ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమ జిల్లాల్లో పంటపొలాలకు నికరసాగు జలాలు తీసుకురావాలన్నారు. వ్యవసాయం సజీవంగా బ్రతకాలంటే కనీసం 30 శాతం వ్యవసాయ భూమికి సాగునీరు అందించాలని అన్నారు. హంద్రీనీవా ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 80,000; అనంతపురం జిల్లాలో రెండు దశల కింద 3,45,000, కడప జిల్లాలో 37,500; చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సి వుంది. అయితే ప్రస్తుత కాలువ సామర్థ్యం అందుకు అనుగుణంగాలేదన్నారు. గత ప్రభుత్వం హంద్రీనీవా కాలువ వెడల్పుకు,పంట కాలువల నిర్మాణానికి నిధులు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తూ కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. రానున్న బడ్జెట్ లో హంద్రీనీవా కాలువ వెడల్పును పదివేల క్యూసెక్కులకు పెంచేందుకు, ఆయకట్టు భూములకు సాగునీరు ఇచ్చేందుకు అవసరమైన పంటకాల్వల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివారెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, సాంబ శివ, నియోజకవర్గ కార్యదర్శి కె మురళి కార్యవర్గ సభ్యులు తిరుమల, మాధవ్,సూరి,రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
జి.ఈశ్వరయ్య
Comments
Please login to add a commentAdd a comment