No Headline
నిరాశ్రయులపై సర్కార్ నిర్లక్ష్యం ● సాయం కోసం ఎదురుచూపు
వరద పోయినా వదలని బురద కష్టాలు ● వరద నీటిలో కుళ్లి పోయిన పంటలు
వంట సామగ్రి, బట్టలు నీటిపాలు ● తడిసి ముద్దయిన తిండి గింజలు
విద్యుత్ సరఫరా లేక నాలుగు రోజులుగా అంధకారం
‘సాక్షి’ ప్రతినిధి ముందు బోరుమన్న వరద బాధితులు
భోజనం సంగతి దేవుడెరుగు గుక్కెడు నీటి కోసం లంక గ్రామాలు ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పుడు వరద తగ్గింది. ఇళ్లలో చేరిన బురదను తొలగించడం కష్టంగా మారింది. నిన్నటిదాకా ఇంటినిండా వరద నీరు. ఇప్పుడు బురదను కడుక్కుందామన్నా చుక్కనీరు దొరకడంలేదు. బురదను తొలగించుకునేందుకు కూలీలు కూడా అందుబాటులో లేరు. గోరుచుట్టపై రోకటి పోటు అనే చందంగా పరిస్థితి ఉందని బాధితులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సాయంకోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా లేదు.
జ్వరాల విజృంభణ..
వరద ప్రభావంతో లంక గ్రామాల్లో పలువురు జ్వరాల బారినపడ్డారు. బయట ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి. ముంపువాసుల్లో చాలామంది పేదలు. రెక్కాడితేగానీ డొక్కాడని వారున్నారు. వారంరోజులుగా వారికి పనుల్లేవు. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలంటే వేలకు వేలు కావాల్సిందే. చాలామంది డబ్బుల్లేక లంకల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బయటకు వచ్చి చూపించుకుందామన్నా ప్రభుత్వం కనీసం బోట్లు ఏర్పాటు చేయలేదు.
బాబు హామీ గాలికి..
చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తుపాను, వరదల్లో నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 20 వేలకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలని నాడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని నేడు పలువురు లంకగ్రామాల రైతులు గుర్తుచేశారు. ఇప్పడు అధికారంలో ఉన్న చంద్రబాబు తగినంతగా పరిహారం అందజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మూగజీవాల అరణ్యరోదన..
నాలుగు రోజులుగా వరద నీటిలో చిక్కుకున్న వేలాది పశువులు గ్రాసం కోసం అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ముంపులో ఉన్న లంక గ్రామాల్లో వేలాది పశువులు పస్తులతో అల్లాడుతున్నాయి. బుధవారం జిల్లా కలెక్టర్‌తోపాటు కొందరు ప్రజాప్రతినిధులు, పశుసంవర్ధకశాఖ దాణా అందిస్తున్నట్లుగా ఫొటోలకు ఫోజులిచ్చారు.ఎంతమందికి ఇచ్చారంటే శాఖ అధికారులు స్పందించడంలేదు. కానీ క్షేత్రస్థాయిలో బాధిత రైతులందరికీ దాణా ఇవ్వలేదు. మొక్కుబడిగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నాలుగు రోజుల వరద పుణ్యమాని వేమూరు, రేపల్లెతోపాటు జిల్లావ్యాప్తంగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కృష్ణా నది ముంపు ప్రాంతాలలో దెబ్బతినండతో గ్రామాలకు రాకపోకలకు వీల్లేకుండా ఉంది. అరవింద వారధిపై బురదతోపాటు చెత్త పెద్దఎత్తున చేరింది.
అంధకారంలోనే లంకగ్రామాలు..
కృష్ణాకు వరద సంభవించి నాలుగు రోజులైనా లంక గ్రామాల్లో విద్యుత్‌ను పునరుద్ధరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు అంధకారంలో అల్లాడి పోతున్నారు. దోమలు, విషపురుగుల నుంచి తప్పించుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. విద్యుత్‌ను తక్షణం పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నా అధికారులు స్పందించడంలేదు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో 2023 డిసెంబర్ 5న జిల్లాలో మిచాంగ్ తుఫాను ప్రభావంతో 261 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. అయితే, అధికారులు రెండవరోజు సాయంత్రానికే సరఫరాను పునరుద్ధరించారు.
అందని ప్రభుత్వ సాయం..
లంక గ్రామాల ముంపు బాధితులకు ఇప్పటివరకూ ప్రభుత్వం సాయం అందించలేదు. తూతూమంత్రంగా భోజనం, తాగునీటిని మాత్రమే సరఫరా చేసి చేతులు దులుపుకున్నారు. అదికూడా అధికారుల ద్వారా అని చెబుతున్నా..పచ్చపార్టీ నేతలకే బాధ్యతలు అప్పగించడంతో ఒక వర్గం వారికే అందుతోంది. ప్రధానంగా పేదలు, ఎస్సీ కాలనీలకు సాయం అందడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment