మత్స్యకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
చీరాల టౌన్: గంగమ్మ తల్లిని నమ్ముకుని బతుకు వేట సాగిస్తున్నాం.. వేట తప్ప మరో పని తెలియని మత్స్యకారులం. నిత్యం ప్రాణాలను పణంగా పెట్టి వేట సాగించే మత్స్యకారులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి అండగా నిలవాలని మత్స్యకార పెద్దలు డిమాండ్ చేశారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మండలంలోని వాడరేవు గ్రామంలోని మార్కెట్ యార్డు వద్ద నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషర్‌మెన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. గంగమ్మతల్లికి, వేట సామగ్రి, బోట్లకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో మత్స్యకారులు, మత్స్యకార సొసైటీల నాయకులు, గ్రామస్తులు ర్యాలీ చేశారు.
వేట నిషేధ సాయం అందించాలి..
ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మత్స్యకార పెద్దలు ఎరిపిల్లి రమణ, పిక్కి సంతోష్, రాజారావు, దుర్గారావు, కాశీ తదితరులు మాట్లాడారు. తరతరాలుగా గంగమ్మ తల్లిని నమ్ముకుని సముద్రంలో వేట సాగించే మత్స్యకారుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఏడాదిలో తుపాన్లు, భారీ వర్షాలు, అల్పపీడనాల వలన వేట సాగక ఇబ్బందులు పడుతున్నామని, అలానే రెండున్నర నెలలపాటు సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు పూటగడవని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తమ అధికారం కోసం రాజకీయపార్టీలు మత్స్యకారులకు పలు హామీలు ఇచ్చారని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి వేట చేసి కుటుంబాన్ని పోషించుకునే మత్య్సకారులకు వేట నిషేధ సాయం త్వరగా అందిస్తే ఇబ్బందుల నుంచి బయటపడుతామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తమకు అండగా నిలవాలని కోరారు. మత్స్యకారులకు అందించే డీజిల్ సబ్సిడీని, రాయితీ డీజిల్ పరిమాణాన్ని కూడా పెంచాలన్నారు. జీపీఎస్ కిట్లు, సోలార్ లైట్లు, లైఫ్ జాకెట్లు, రాయితీపై వలలు, బోట్లు, ఇంజిన్లు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామానికి చెందిన సీనియర్ మత్స్యకారులను సత్కరించారు. కార్యక్రమంలో వాడరేవుకు చెందిన మత్స్యకారులు, సొసైటీ సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం వాడరేవులో ర్యాలీ
Comments
Please login to add a commentAdd a comment