ఉచితం అందడం లేదు...దోపిడీ ఆగడం లేదు
సాక్షి ప్రతినిధి,బాపట్ల: బాపట్ల జిల్లాలోని వేమూరు, రేపల్లె, బాపట్ల, చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో ఉన్న అన్ని వనరుల నుంచి ఇసుకను అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ చెప్పినట్లు ఇప్పుడు ఏ ఒక్క వినియోగదారుడికి ఉచిత ఇసుక అందే పరిస్థితి లేదు. బాబు చెప్పినా, మంత్రి లోకేశ్ ప్రకటించినా టీడీపీ నేతలు మాత్రం పిడికెడు ఇసుక కూడా ఉచితంగా వదిలే పరిస్థితి లేదంటున్నారు. అందిన కాడికి అమ్ముకుంటున్నారు. ఇక్కడినుంచి ఇసుక ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకూ తరలిపోతోంది. జిల్లాలోని చినగంజాం మండలం కడవకుదురు, వేటపాలెం మండలం పందిళ్లపల్లి ప్రాంతాల నుంచి ప్రకాశం, పల్నాడు జిల్లాలతోపాటు తెలంగాణకి పెద్దఎత్తున ఇసుక తరలిపోతోంది. పర్చూరు, చీరాల నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు ఇసుక అక్రమ రవాణాను నడిపిస్తున్నారు. గతంలో రాత్రిపూట మాత్రమే ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న టీడీపీ నేతలు ఇప్పుడు పగలు కూడా తరలిస్తున్నారు. పందిళ్లపల్లి ప్రాంతం నుంచి బాపట్ల, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలకు ఇసుక తరలించి అమ్ముకుంటున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకూ అమ్ముతున్నారు. బాపట్ల నియోజకవర్గం పరిధిలోని వెదుళ్లపల్లి ప్రాంతాల్లోని అసైన్డ్ భూములనుంచి టీడీపీ నేతలు నియోజకవర్గవ్యాప్తంగా ఇసుక తరలించి అమ్ముకుంటున్నారు.
మంత్రుల ఇలాకాల్లోనూ ఇంతే....
● మంత్రి అనగాని సత్యప్రసాద్ సొంత నియోజకవర్గం రేపల్లెలోని పెనుమూడి రేవు నుంచి కొంతకాలంగా ఇసుకను రేపల్లె, చెరుకుపల్లి, గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు.
● మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు చెందిన వేమూరు నియోజకవర్గంలో కృష్ణా నది నుంచి ఇసుకను పెద్దఎత్తున తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొల్లూరు మండలం జువ్వలపాలెం, గాజుల్లంక ప్రాంతాల్లోని కృష్ణానది నుంచి ఇసుకను తరలించి వినియోగదారులకు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ జువ్వలపాలెం, గాజుల్లంక రెండు రీచ్‌లను అధికారికంగా గుర్తించారు. కృష్ణా నదిలో నీరు పారుతుండటంతో ఇప్పటికీ రీచ్‌లను ప్రభుత్వం ప్రారంభించలేదు. జనసేన, టీడీపీ నేతలు మాత్రం ఇక్కడి నుంచి వందల ట్రాక్టర్లు పెట్టి అక్రమంగా ఇసుకను తరలించి అమ్ముకుంటున్నారు. గాజుల్లంక ప్రాంతంలో జనసేన నాయకులు ఇసుకను తవ్వితీసి చెరుకుపల్లి, భట్టిప్రోలు, రేపల్లె, తెనాలి ప్రాంతాలకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. డిమాండ్‌ను బట్టి ట్రాక్టర్ ఇసుక రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకూ అమ్ముతున్నారు.
● మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి నియోజకవర్గంలోని గుండ్లకమ్మ నది నుంచి టీడీపీ నేతలు ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దాదాపు జిల్లాలోనిఅన్ని నియోజకవర్గాలనుంచి టీడీపీ నేతలు ఇసుకను అక్రమంగా తవ్వి అమ్మకానికి పెట్టారు. చీరాల, పర్చూరు ప్రాంతాల్లో కీలక నేతలే ఇసుక అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ట్రాక్టర్ రూ.3 నుంచి రూ.6 వేలు
పర్చూరు, చీరాల నుంచి
రాష్ట్రవ్యాప్తంగా ఇసుక సరఫరా
తెలంగాణకు సైతం ఇక్కడి
నుంచే తరలింపు
కృష్ణా నది నుంచి ఇసుకను
తరలిస్తున్న టీడీపీ నేతలు
గాజుల్లంక నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న జనసేన నేతలు
బాపట్ల జిల్లాలో ఇప్పటికీ
ప్రారంభంకాని ప్రభుత్వ రీచ్‌లు
ఆందోళనలో వినియోగదారులు
Comments
Please login to add a commentAdd a comment