జగన్ ఫ్లెక్సీని తగలబెట్టిన దుండుగులు
వేమూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు తగలబెట్టిన ఘటన వేమూరు దళితవాడలో జరిగింది.శనివారం ఆయన జన్మదిన వేడుకలు సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పెట్రోలు చల్లి నిప్పు అంటించడంతో కొంత భాగం కాలిపోయింది. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు.
ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు
చుండూరు(వేమూరు): యువకుడిని బంధించి కొట్టడంతో పాటు కులం పేరుతో దూషించిన వ్యక్తిపై ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు చుండూరు ఎస్‌ఐ రెహమాన్ తెలిపారు. చుండూరు మండలంలోని చినపరిమి గ్రామానికి చెందిన పట్లూరి భవానీశంకర్ తెనాలి ఎన్‌ఆర్‌ఐ కళాశాలల్లో డ్రిగీ చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన మర్రిరెడ్డి అయ్యప్పరెడ్డి తన తోటలో కొబ్బరికాయలు దొంగతనం చేశాడని అనుమానంతో భవానీశంకర్‌ని కొట్టాడు. దీంతో యానాది కుల పెద్దలు ఎందుకు కొట్టావంటూ అడిగేందుకు అయ్యప్పరెడ్డి ఇంటికి వెళ్లారు. అతడు వాళ్లను కులం పేరుతో దూషించడంతో చుండూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అయ్యప్పరెడ్డిపై ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రెహమాన్ తెలిపారు.
రైలు నుంచిడి జారిపడి
వ్యక్తి మృతి
చీరాల రూరల్: రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం స్టూవర్టుపురం–బాపట్ల రైల్వేస్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య వివరాల మేరకు.. విజయవాడ వైపు వెళ్లే రైలు పట్టాలపై వ్యక్తి మృతి చెంది ఉన్నాడనే సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించగా మృత దేహం వద్ద ఎటువంటి సమాచారం లభించలేదని చెప్పారు. మృతుడి వయస్సు 55 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి మృతిచెంది ఉంటాడనే అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment