ప్రజలతో పోలీసులు ఫ్రెండ్లీగా ఉండాలి
కొల్లిపర: స్టేషన్‌కు వచ్చే ప్రజలతో పోలీసులు ఫ్రెండ్లీగా ఉంటూ సమస్యలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ అన్నారు. ఆదివారం కొల్లిపర స్టేషన్‌ను తెనాలి డీఎస్పీ జనార్దనరావు, ఎ్‌స్‌బీ సీఐ రాంబాబులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. రిసెప్షన్ సిబ్బంది పనితీరు, రికార్డులు, కేసుల పరిష్కారం, స్టేషన్ స్థితిగతులు తదితరాలను పరిశీలించారు. ఎస్‌ఐ పి.కోటేశ్వరరావును అడిగి వివరాలు తెలుసుకున్నారు. సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల కట్టడి కోసం స్టేషన్ అధికారులు నిరంతరం శ్రమించాలన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, సచివాలయం మహిళాపోలీసులు పాల్గొన్నారు.
3 నుంచి జీఎన్‌ఎం వార్షిక పరీక్షలు
గుంటూరు మెడికల్: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్‌ఎం) వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు గుంటూరు జీజీహెచ్ ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపల్ కోటా సుజాత ఆదివారం తెలిపారు. ఉదయం 9 – మధ్యాహ్నం 12 గంటల వరకు గుంటూరు వైద్య కళాశాలలో పరీక్షలు ఉంటాయని చెప్పారు. జిల్లావ్యాప్తంగా 36 నర్సింగ్ స్కూల్స్ నుంచి 1,500 మంది హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల చీఫ్ ఎగ్జామినర్‌గా గుంటూరు జీజీహెచ్ సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ డాక్టర్ బత్తుల వెంకట సతీష్‌కుమార్ వ్యవహరిస్తారని వెల్లడించారు.
పంటల బీమా ప్రీమియం గడువు పొడిగింపు
కొరిటెపాడు(గుంటూరు): రబీ పంటలకు సంబంధించి రైతులు తమ వాటా ప్రీమియం కట్టడానికి ఈ నెల చివరి వరకు గడువు పొగించినట్లు గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి గడువు ఈ నెల 15వ తేదీతో ముగిసిందన్నారు. రైతుల వినతుల మేరకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు పొడిగించారని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు 35 శాతం మంది రైతులే ప్రీమియం చెల్లించారన్నారు. మిగతావారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలకు చెందిన గ్రామ, మండల, డివిజన్ స్థాయి అధికారులు కూడా రైతులు ప్రీమియం కట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పప్పుశనగకు హెక్టారుకు రూ.125, జొన్నకు రూ.140, మొక్కజొన్నకు రూ.119, పెసరకు రూ.285, మినుముకు రూ.113 చొప్పున ప్రీమియం చెల్లించాలన్నారు. రైతు సేవా కేంద్రాల అసిస్టెంట్లు, మీ సేవా, కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్‌సీ), ఇన్సూరెన్స్ పోర్టల్‌లో ప్రీమియం కట్టి బీమా పథకంలో చేరాలని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రస్థాయి ఖోఖో
విజేత ఉమ్మడి ప్రకాశం
జే.పంగులూరు: రాష్ట్రస్థాయి ఖోఖో విజేతగా ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టు నిలిచింది. తిరుపతి జిల్లా పుత్తూరులో ఈ నెల 20,21,22 తేదీల్లో అండర్–19 బాలుర స్కూల్ గేమ్స్ పోటీలు నిర్వహించారు. ఇందులో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రథమ స్థానం సాధించింది. ఫైనల్లో ప్రకాశం జిల్లా ఖోఖో బాలుర జట్టు చిత్తూరు జిల్లాతో తలపడింది. రెండు విన్నింగులు కలిసి 10 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా పీడీ సీతారామిరెడ్డి మాట్లాడుతూ అండర్–19 ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టు గత 24 ఏళ్ల నుంచి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధిస్తున్నట్లు తెలిపారు. ఈఏడాది ప్రథమ స్థానం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రథమ స్థానం సాధించిన బాలురు జట్టుకు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ కప్, పతకాలు అందించారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల): కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద ఆదివారం 1902 క్యూసెక్కులు విడుదల చేశారు. బ్యాంక్ కెనాల్‌కు 98, తూర్పు కెనాల్‌కు 65, నిజాంపట్నం కాలువకు 72, కొమ్మమూరు కాలువకు 1376 క్యూసెక్కులు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment