‘మత్స్య’ ఆదాయం పెంపునకు కృషి చేయండి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: మత్స్య సంపద, ఆక్వా రంగం ద్వారా జిల్లా వార్షికాదాయం 12 శాతం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. విజన్ బాపట్ల–2047 అమలు ప్రణాళికపై 12 శాఖల అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. కోస్తా తీర ప్రాంతంలో మత్స్య సంపద పెంపునకు విస్తారమైన వనరులు ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకుని మత్స్యకారులు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిజాంపట్నం ఓడరేవు విస్తరణ పనులు వేగంగా జరిగేలా పర్యవేక్షించాలని, చీరాల వాడరేవు నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ప్రతిపాదనలు త్వరగా పంపాలన్నారు. 289 ఫిషింగ్ టూల్స్ జిల్లాకు మంజూరు కాగా, 15 మంది మత్స్యకారులకు పంపిణీ జరిగాయని, మిగిలినవి మత్స్యకారులకు అందించాలన్నారు. 10,050 మత్స్యకారులకు వేట నిషేధిత సమయంలో పరిహారం అందించడానికి శరవేగంగా సర్వే పూర్తి చేయాలన్నారు. కౌలు రైతులందరికీ సీసీఆర్సీ కార్డులు జారీచేసి రుణ సదుపాయం కల్పించాలన్నారు. వాడరేవు నుంచి సూర్యలంక వరకు రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మౌలిక వసతుల కల్పనతో తీర ప్రాంతాలు మరింతగా పర్యాటకులను ఆకర్షిస్తాయన్నారు. జిల్లాలోని 313 పరిశ్రమలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పరిశ్రమలు, అసంఘటిత రంగాలలో తనిఖీలు నిర్వహించి కార్మికులకు కనీస వేతనం అమలయ్యేలా చూడాలన్నారు. సీపీఓ శ్రీనివాస్, 12 శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment