ఆశ చూపి రూ.కోట్లు కొల్లగొట్టారు
● పెట్టుబడుల పేర్లతో మోసం చేశారు ● తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశాలోనూ బాధితులు ● సుమారు రూ.30 కోట్లకుపైగా స్వాహా చేశారని ఆరోపణ ● గుంటూరులోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితుల ఫిర్యాదు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): పెట్టుబడుల పేర్లతో డబ్బులు ఆశ చూపి రూ.కోట్లు కాజేసి మోసగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద నుంచి సుమారుగా రూ.ఐదారు కోట్లకుపైగా లాగేసుకుని ముఖం చాటేశారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెదనందిపాడుకు చెందిన సంధ్యా శివపార్వతి, షేక్.హుస్సేన్‌లాల్, కాకినాడ జిల్లా జగ్గంపేట వాసి బి.క్రాంతికుమార్ దంపతులు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. శివపార్వతి మాట్లాడుతూ ‘‘మూడేళ్ల క్రితం రాజేంద్రనగర్‌కు చెందిన ఓ మహిళ ఆన్‌లైన్‌లో పరిచయమై గుంటూరు జేకేసీ కళాశాల రోడ్డులో ఉంటున్న ఒకరిని పరిచయం చేసింది. ఆ వ్యక్తికి రూ.లక్ష చెల్లిస్తే, నెలకు రూ.9 వేలు చొప్పున 20 నెలల్లో రూ.1,80 లక్షలు చెల్లిస్తామని చెప్పింది. 20 మందితో గ్రూప్ చేసి లక్కీడ్రా తీసి విజేతకు రూ.90 వేలు చెల్లిస్తామని నమ్మబలికింది. దీంతో గతేడాది జూన్‌లో రూ.లక్ష ఫోన్‌పే చేశా. ఆ తర్వాత రూ.4 లక్షలు చెల్లిస్తే 80 రోజులకు ఒకసారి రూ.2.80 లక్షలు చొప్పున ఐదుసార్లుగా చెల్లిస్తామని ఆశ చూపడంతో రాజేంద్రనగర్‌కు చెందిన మహిళ సమక్షంలో రూ.8 లక్షలు చెల్లించా. మరోసారి రూ.కోటి చెల్లిస్తే కారు, 100 గ్రాముల బంగారం, కంపెనీలో ఉద్యోగమిచ్చి, నెలకు రూ.2 లక్షల జీతమని నమ్మబలికితే డ్వాక్రా మహిళలు, రోజు కూలీలు, ఆటో డ్రైవర్స్, స్నేహితులతో కలిసి మరోసారి మహిళ సమక్షంలో రూ.67 లక్షలు చెల్లించా. వారాంతపు చెల్లింపులని ఆశ పెడితే మరో రూ.2 లక్షలు చెల్లించాను. తర్వాత వెంచర్ ప్రారంభించామని క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉందని చెబితే రూ.20 లక్షలు చెల్లించా. ఫిక్స్‌డ్ డిపాజిట్లు పదినెలల్లో రెండింతలవుతాయని చెబితే మరో రూ.10 లక్షలు చెల్లించాను. మరో కంపెనీ పేరుతోనూ ఒత్తిడి చేసి మరికొంత నగదు తీసుకున్నారు. 2023 నుంచి 2024 ఫిబ్రవరి వరకు రూ.1.5 కోట్లు చెల్లించాను. అని ఆవేదన వ్యక్తం చేశారు. క్రాంతికుమార్ మాట్లాడుతూ రూ.12 లక్షలు చెల్లిస్తే రూ.36 లక్షలు, రూ.6 లక్షలకు రూ.18 లక్షలు చెల్లిస్తామని తనను మోసంగించారని వాపోయారు. దాదాపు 2 వేల మంది నుంచి సుమారు 30 కోట్లకుపైగా వసూలు చేశారని బాధితులు చెప్పారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశాలోనూ వీరి బాధితులు ఉన్నారని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment