అంతర్ రాష్ట్ర బైకు దొంగ అరెస్ట్
వేలిముద్ర స్కానర్ ఆధారంగా పట్టుకున్న పోలీసులు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన ఉన్న ద్విచక్రవాహనాలను చోరీ చేసే అంతర్ రాష్ట్ర దొంగను వేలిముద్ర స్కానర్ ఆధారంగా నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్ధానిక నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎం.నజీర్ కేసు వివరాలను వెల్లడించారు. హనుమయ్యనగర్‌కు చెందిన మాదాల సురేష్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తుంటాడు. ఈనెల 15న రాత్రి తన ఇంటి ముందు ద్విచక్రవాహనం పార్కింగ్ చేశాడు. మరుసటి రోజు ఉదయం లేచి చూసే సరికి వాహనం కనిపించలేదు. దీంతో నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్టేషన్ పరిధిలో ఇదే తరహాలో మరో రెండు ద్విచక్రవాహనాలు చోరీకి గురికావడంతో అదనపు ఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసుల సహకారంతో నగరంపాలెం సీఐ నజీర్ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. నగరంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. పాత నేరస్తులను విచారించారు. థంబ్ ప్రింట్ (వేలిముద్ర) స్కానర్ ద్వారా విచారణ చేపట్టారు. దీని ఆధారంగా వాహనాలు చోరీ చేసింది దేవాపురానికి చెందిన పులి రమేష్‌గా గుర్తించి ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. రమేష్ నుంచి ఐదు ద్విచక్రవాహనాలను రికవరీ చేశారు. రమేష్‌పై జిల్లాలోనే అనేక పోలీస్ స్టేషన్లలో 52 కేసులు ఉన్నట్లు గుర్తించారు. సోమవారం రమేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రమే ష్‌ను పట్టుకునేందుకు ప్రతిభ కనబరిచిన నగరంపాలెం సీఐ ఎం.నజీర్‌ను ఎస్సై సలాంను సిబ్బందిని ఎస్పీ సతీష్‌కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment