ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే అర్జీలను పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ సారించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. మా సమస్యలు పరిష్కరించండంటూ బాధితులు అర్జీల ద్వారా జిల్లా కలెక్టర్‌కి విన్నవించారు. వినతపత్రాలను పరిశీలించిన కలెక్టర్ కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపారు. పీజీఆర్‌ఏస్‌లో 145 అర్జీలు నమోదయ్యాయి. జిల్లా పశుసంవర్ధక శాఖ ద్వారా చేపడుతున్న ‘ఉచిత పశు ఆరోగ్య శిబిరాల’ వాల్‌పోస్టర్‌లను కలెక్టర్ విడుదల చేశారు. ఈనెల 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నా మన్నారు. వ్యవసాయ శాఖ రూపొందించిన 2025 సంవత్సరం డైరీ, క్యాలెండర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు ఉచితంగా భోజనం సదుపాయం కల్పించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అధికారులు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ అన్నారు. పంచాయతీశాఖలో 28 అర్జీలు పెండింగ్‌లో ఉంటే ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. మున్సిపాలిటీ, వివిధ శాఖల్లోనూ పెండింగ్‌లో ఉండడంపై ఆయన ఆరా తీశారు. పెండింగ్ అర్జీలపై పూర్తిస్థాయిలో ఆడిట్ చేయాలని, గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. కుల గణన సర్వేలో వచ్చిన ఫిర్యాదులు, పరిష్కారంపై వీక్షణ సమావేశం ద్వారా మండల అధికారులతో సమీక్షించారు. బాపట్ల మండలంలో 22 అర్జీలు, బల్లికురవలో ఐదు, చీరాల పట్టణంలో మూడు, గ్రామీణ ప్రాంతంలో నాలుగు అర్జీలు పెండింగ్‌లో ఉండడంపై ఆరా తీశారు. ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చిన 156 అర్జీలను సత్వరమే పరిష్కరిస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రజా ప్రతినిధులకు అధిక ప్రాధాన్యతనివ్వాలని, సంబంధిత అధికారులకు యాప్‌లో నిక్షిప్తం చేయాలన్నారు. అర్జీల పరిష్కారం తదుపరి సంబంధిత ప్రజాప్రతినిధులకు సమాచారం పంపాలని ఆదేశించారు. ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు ఇవ్వడానికి సుమారు 200 మంది వస్తున్నారన్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారిని ఆదేశించారు. ప్రతి సోమవారం గ్రీవెనన్స్ కార్యక్రమానికి వచ్చే అర్జీదారులకు రెడ్‌క్రాస్ సంస్థ భోజన సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు. ఎంఎస్‌ఎంఈ విద్యుత్ సర్వీసుల సర్వేలో మిగిలిన వాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎన్‌పీసీఐ లింకేజీ, వలస కూలీ లు సర్వేలపై సమగ్రంగా సమీక్షిస్తామన్నారు. విశేష సేవలు అందిస్తున్న రెడ్‌క్రాస్ సంస్థలో సభ్యత్వ నమోదు బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రతి మండలంలో 50 మందికి తగ్గకుండా ఎంపీడీఓలు సభ్యత్వ నమోదు చేయించాల న్నారు. సభ్యత్వం పొందే ప్రతి ఒక్కరూ రూ.1,100 చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నా రు. రెడ్‌క్రాస్‌లో చేరిన వారికి జీవితకాల సభ్యత్వ కార్డును అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, డీఆర్వో డి.గంగాధర్‌గౌడ్, ఆర్డీవో పి గ్లోరియా పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
Comments
Please login to add a commentAdd a comment