శాంతిభద్రతల పరిరక్షణలో ఏఆర్ పోలీస్ పాత్ర కీలకం
బాపట్ల: శాంతిభద్రతల పరిరక్షణలో ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది విధులు కీలకమని అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు ఏఆర్ పోలీస్ సిబ్బందికి రెండు వారాల ‘మొబలైజేషన్‘ కార్యక్రమాన్ని సోమవారం స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో అడిషనల్ ఎస్పీ ప్రారంభించారు. సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించడానికి తగిన మెళకువలు సూచించడంతోపాటు వ్యక్తిగత జీవితంలో కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం, తగిన సమయం కేటాయింపు, ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ విధులు నిర్వహించే విధానంపై అడిషనల్ ఎస్పీ వివరించారు. పోలీస్ ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వహించేందుకు కఠినమైన శిక్షణ, తగిన మెళకువలను శిక్షణ సమయంలో నేర్పడం జరుగుతుందన్నారు. ఇతర ఉద్యోగాలతో పోలిస్తే పోలీసు ఉద్యోగం భిన్నంగా ఉంటుందన్నారు. పోలీసులు చేసే ప్రతి పనిలోనూ ఎంతో నేర్పరితనం, సమయస్ఫూర్తి, నైపుణ్యంతో కూడుకుని ఉంటాయన్నారు. సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణతో మెలగడం కీలకమన్నారు. వృత్తి రీత్యా పోలీస్ శాఖలో చోటుచేసుకుంటున్న నూతన మార్పులను అందిపుచ్చుకునే విధంగా ఏఆర్ సిబ్బందికి ప్రతి ఏడాదీ మొబలైజేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. దీని ద్వారా ఉద్యోగంలో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న తర్ఫీదు అంశాలను మరోసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని మరింత సమర్థంగా విధులు నిర్వహించడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అడ్మిన్ ఆర్‌ఐ మౌలుద్దీన్, వెల్ఫేర్ ఆర్‌ఐ శ్రీనివాసరెడ్డి, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించండి
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కారవేదికలో అర్జీలను పరిశీలించారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఇతర సమస్యలపై 58 మంది ఫిర్యాదిదారులు వారి సమస్యలను అడిషనల్ ఎస్పీకి విన్నవించుకున్నారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ జగదీష్‌నాయక్, పి.జి.ఆర్.ఎస్ సెల్ ఎస్‌ఐ శ్రీనివాస్ ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్
Comments
Please login to add a commentAdd a comment