జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: అసంఘటిత రంగ కార్మికులందరికీ అధికారులు ఉచిత ప్రమాద బీమా సభ్యత్వ నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆదేశించారు. వివిధ సంక్షేమ పథకాల అమలుపై జిల్లా అధికారులతో కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–శ్రమ పోర్టల్ ద్వారా ప్రమాద బీమా ఉచిత సభ్యత్వ నమోదు చే యించాలని అన్నారు. 16 నుండి 60 ఏళ్ల లోపు వారంతా పేర్లు నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, వలస కార్మికులు, రిక్షా కార్మికులు, ఇళ్లలో పని చేసేవారు, మత్స్యకారులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు, చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ సభ్యత్వం లేని వారు, ఆదాయ పన్ను పరిధిలోకి రానివారంతా అర్హులేనన్నారు. విద్యార్థులు కూడా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. పేర్లను నమో దు చేసుకోదల్చినవారు సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, కార్మిక శాఖ కార్యాలయంలోనూ, లేదా నేరుగా (ఈస్‌హెచ్‌ఆర్‌ఎం.ఏపి.జీఓవి.ఇన్) ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ పథకం కింద 4,81,711 మందికి బీమా వర్తింప చేయాలని లక్ష్యంకాగా ఇప్పటికే 2,97,169 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. మిగిలిన 1,84,542 మంది అసంఘటిత కార్మికులను నమోదు చేయించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, డీఆర్వో డి.గంగాధర్ గౌడ్, ఆర్డీవో పి గ్లోరియా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment