హేతువాద కవిరాజు | - | Sakshi
Sakshi News home page

హేతువాద కవిరాజు

Published Tue, Jan 21 2025 2:25 AM | Last Updated on Tue, Jan 21 2025 2:25 AM

హేతువాద కవిరాజు

హేతువాద కవిరాజు

క్రోసూరు: దేశవ్యాప్తంగా మతతత్వం పెచ్చురిల్లుతున్న నేటి తరుణంలో కలాన్ని ఖడ్గంగా చేసుకుని, తన జీవితాన్నే ఆయుధంగా మలిచి సంఘ సంస్కరణకు పూనుకున్న సాహితీవేత్త, హేతువాది, అభ్యుదయవాది, మహాకవి కొండవీటి వెంకటకవి. ఆయన పల్నాడు జిల్లా క్రోసూరు మండలం విప్పర్ల వాస్తవ్యులు. కొండవీటి వెంకటకవి అసలు పేరు కొండవీటి వెంకటయ్య, తల్లిదండ్రులు నారాయణ, శేషమ్మలు. 1918 జనవరి 25న ఆయన జన్మించారు. ఈయన సతీమణి పేరు చిన్నమ్మ, వీరికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.

వెంకటకవి రచనలు..

వెంకటకవి తన 14వ ఏట నుంచి రచనలు చేయటం ప్రారంభించారు. 1932లో కర్షక శతకాన్ని రాశారు. అనంతరం హితబోధ, చెన్నవ కేశవ శతకం, 1954లో నెహ్రూ చరిత్ర మొదటి భాగం రచించి బెజవాడగోపాలరెడ్డికి, ద్వితీయభాగం గుత్తికొండ నరహరికి అంకితం చేశారు. త్రిశతి పేరుతో బుద్ధుడు, వేమన, గాంధీజీల గురించి మూడు శతకాలు రచించారు. 1984లో పోతులూరి బ్రహ్మం మఠానికి ఆస్థానకవిగా ఊంటూ శ్రీ వీర బ్రహ్మేంద్ర సుప్రభాతాన్ని సంస్కృతంలో రచించారు. 1977లో అగ్రనటుడు నందమూరి తారక రామారావు తీసిన దానవీరశూరకర్ణ సినిమాకు సంభాషణలు రాశారు. అలా చలన చిత్ర రంగానికి పరిచమయ్యారు. ఆ తరువాత శ్రీమద్విరాటపర్వం, శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహేంద్రస్వామి చరిత్ర చిత్రాలకు సంభాషనలు రాశారు. వీరు రచించి గ్రంథాలన్నీ కవిరాజు గ్రంథ మాల పేరుతో స్వయంగా ప్రకటించినవే కావటం విశేషం. అప్పట్లో ఎంఎన్‌ స్ఫూర్తితో, కమ్యూనిస్టు భావజాలంతో బాబాలను విమర్శిస్తూ ఉపన్యాసాలిచ్చారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి భావజాలంతో హేతువాదిగా మారి అనేక రచనలు చేశారు. మంత్రాలు లేకుండా త్రిపురనేని రామస్వామి రాసిన పెళ్లి సూత్రాలు చదివి అనేక వివాహాలు చేయించారు.

పురస్కారాలు..

1953లో గుంటూరు జిల్లా పెదకూరపాడులో వీరికి కవిరాజుగా బిరుదు ప్రధానం చేసి సత్కరించారు. 1971లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌ కళాప్రపూర్ణ పురస్కారం. 1979 వెంకటకవి కవితా బ్రహ్మోత్సవాన్ని డాక్టర్‌ కొడాలి రంగారావు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా సత్తెనపలిల్లో నిర్వహించారు. ఎడ్లబండి కట్టి అంగరంగ వైభవంగా సినీనటులు ఎన్‌టీ రామారావు, కొంగర జగ్గయ్య లతో పాటు వెంకటకవిని సత్తెనపల్లి పురవీధుల్లో ఊరేగించి అశేష జనవాహిని సమక్షంలో పౌరసత్కారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెంకటకవిని అధికార భాషా సంఘ సభ్యులుగా నియమించింది. వెంకటకవి 1991 ఏప్రిల్‌ 7న కాలం చేశారు. వెంకట కవి లాంటి గొప్ప రచయిత, హేతువాదిని తెలుగు ప్రజలు, నేటి విద్యార్థులు, యువత జ్ఞప్తికి చేసుకోవాల్సిన అవసరం ఉంది.

రచనలతో సమాజాన్ని మేల్కొపిన కొండవీటి వెంకటకవి వెంకటకవి క్రోసూరు మండలం విప్పర్ల వాస్తవ్యుడు సుప్రసిద్ధ రచయిత, హేతువాది, ఉపన్యాసకుడిగా ప్రఖ్యాతి 25న జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement