ముద్దాయిలు సత్ప్రవర్తనతో మెలగాలి
ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జి.వాణి
బాపట్ల: రిమాండ్ ముద్దాయిలు సత్ప్రవర్తనతో మెలగాలని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జి.వాణి పేర్కొన్నారు. పట్టణంలోని సబ్ జైలును న్యాయమూర్తి సోమవారం పరిశీలించారు. ఆహారం, నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. రిమాండ్ ముద్దాయిలు ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నారని అడిగి తెలుసుకున్నారు. వారికి ఉన్న హక్కులను వివరించారు. రిమాండ్‌లో ఉన్న ముద్దాయిలు న్యాయవాదులను నియమించుకోలేకపోతే మండల న్యాయసేవ ఆధ్వర్యంలో సాయం అందిస్తామని చెప్పారు. న్యాయమూర్తితోపాటు జిల్లా వైద్యాధికారి డాక్టర్ విజయమ్మ, బాపట్ల సీఐ రాంబాబు, పారా లీగల్ వలంటీర్ కె.రాజారావు ఉన్నారు.
పరిసరాల శుభ్రతతోనే అంతా ఆరోగ్యం
జిల్లా మలేరియా అధికారి గోపినాథ్ వెల్లడి
బల్లికురవ: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అప్పుడే ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని జిల్లా మలేరియా అధికారి గోపినాథ్ వెల్లడించారు. సోమవారం గుంటుపల్లి గ్రామంలోని వీధుల్లో శానిటేషన్ పనులను ఆయన పరిశీలించారు. మురుగు నిల్వలు, వ్యర్థాల కుప్పలను ఎక్కడపడితే అక్కడ పడేయటం వల్ల దోమలు ఉత్పత్తితో సీజనల్ జ్వరాలు, వ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నారు. అంతకు ముందు ఎస్సీ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్ర పరిసరాలను పరిశీలించి అపరిశుభ్రంగా ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం పీహెచ్‌సీలో పలు రికార్డులు పరిశీలించారు. జలుబు, దగ్గు, జ్వరాలు సోకితే తక్షణమే వైద్యశాలకు వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలని, గ్రామాల్లో పరిశుభ్రతపై పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి షేక్ రమీజ్ అహమ్మద్ మలేరియా సబ్ యూనిట్ అధికారి అర్జున్‌రావు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
23 నుంచి మిర్చి యార్డులో రైతులకు ఉచిత భోజనం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డులో గురువారం నుంచి రైతులకు ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మార్కెట్ యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు తెలిపారు. కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అమానత్ పట్టిలు ఆధారంగా రైతులకు ఉచిత భోజనం టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. ఉచిత భోజన కేంద్రం వద్ద సిబ్బందిని కేటాయించి, వారికి శిక్షణ కూడా ఇచినట్లు తెలిపారు.
యార్డుకు
90,567 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 90,567 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 77,096 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.7,200 నుంచి రూ.15,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.7,500 నుంచి రూ.16,000 వరకు ధర లభించింది. ఏసీ కామన్ రకం రూ.7,200 నుంచి రూ.13,500 వరకు ధర పలికింది. ఏసీ ప్రత్యేక రకాలకు రూ.7,500 నుంచి రూ.16,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,000 నుంచి రూ.10,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 54,523 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment