తుమృకోటలో పులి గుర్తులు అవాస్తవం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సత్యనారాయణ
రెంటచింతల: మండలంలోని తుమృకోట గ్రామ సమీపంలో నల్లమల అడవిప్రాంతంలో శనివారం కనిపించినవి పులి గుర్తులు కాదని ఫారెస్ట్ బీట్ అధికారి సత్యనారాయణ సోమవారం తెలిపారు. పల్నాడు జిల్లా తుమృకోట గ్రామ పరిసరాలలో నున్న నల్లమల అటవీప్రాంతంలో పెద్దపులి సంచరించి ఆవుదూడను చంపిందని ప్రజలు చర్చించుకున్నారని, దీంతో తుమృకోట గ్రామానికి చెందిన పశువుల కాపరి బాలునాయక్‌తో పాటు మరికొందరు గ్రామస్తులతో అడవిలోకి వెళ్లి ఆవులు మేతకోసం వెళ్లిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించామన్నారు. అక్కడ ఓ ప్రాంతంలో రాళ్ల మధ్య ఆవుదూడ కాలు ఇరుక్కొనిపోవడంతో ఆ ఆవుదూడకు తీవ్రగాయం కావడంతో అది పెద్దగా అరవడంతో భయపడిన పశుకాపరి, ఆవులు పారిపోయి పరుగెత్తడం జరిగిందన్నారు. అదే పెద్దపులి అయినా.. చిరుతపులి అయిన ఆవుదూడను చంపితీసుకొని వెళ్లిపోవడం జరిగేదన్నారు. కానీ ఇక్కడ రాళ్ల మధ్య కాలు విరిగి ఆవుదూడ అక్కడే కిందపడి ఉందన్నారు. ఈ ప్రాంతంలో పెద్దపులి, చిరుతపులుల గుర్తులు ఏవీ లేవన్నారు. అటవీశాఖ అధికారులు తుమృకోట గ్రామ సమీపంలో నున్న ఈ అడవిలో పులి లేదని నిర్ధారించడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment