తమ్ముడిపై కత్తితో అన్న దాడి
తాడేపల్లిరూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో తన భర్తపై కత్తితో దాడి చేసి కదల్లేని స్థితికి తీసుకొచ్చిన బావ, కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఓ మహిళ విలేకరుల ఎదుట సోమవారం ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె కథనం ప్రకారం షేక్ ఆరిఫ్, ఆసిఫ్ అన్నాదమ్ములు. వీరి తల్లి షేక్ జమీల. ఆరిఫ్‌కు అన్న ఆసిఫ్ వదిన ఆయీషా, తల్లి షేక్ జమీలకు మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. ఆరిఫ్ భార్య సల్మా కాన్పు కోసం విజయవాడలోని ప్రభుత్వ ఆస్పతిలో గతనెలలో చేరింది. ఆ సమయంలో ఆరిఫ్‌కు అతని వదిన ఆయీషా, అన్నయ్య ఆసిఫ్‌కు మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12న ఆసిఫ్ ఆరిఫ్‌ను కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. అనంతరం ఆస్పత్రిలో చేర్పించి ఎవరికీ తెలియకుండా చికిత్స చేయించారు. అనంతరం తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచి బంధించారు. ఆరిఫ్ భార్య సల్మా ఆస్పత్రి నుంచి జనవరి 10న ఇంటికి వచ్చి కదల్లేని స్థితిలో ఉన్న భర్తను చూసి ఏమైందని ప్రశ్నించింది. దీంతో అత్త, బావ, తోడికోడలు బెదిరింపులకు దిగారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని, లేకుంటే నిన్ను, నీ పిల్లలనూ చంపుతామంటూ బెదిరించారు. దీంతో సల్మా కదల్లేని స్థితిలో ఉన్న భర్త, 15రోజుల పసిగుడ్డుతో కలిసి పోలీసులను ఆశ్రయించారు. అయినా పోలీసులు కనికరం చూపలేదు. వారం రోజులుగా పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కేసు నమోదు చేయలేదు. ఆదివారం విజయవాడకు చెందిన టీడీపీ కార్పొరేటర్ హర్షద్ వచ్చి సల్మా, ఆరిఫ్‌లను బెదిరించారు. ఇప్పటికే తీవ్రంగా గాయపడిన ఆరిఫ్‌కు మరో ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. దీంతో సల్మా విలేకరులను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని కన్నీమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment