● గ్రామాలు, పట్టణాల్లో కరువైన నీడ, నీరు ● కొంచెం కవ్వించినా దాడి చేస్తున్న వైనం ● నీటి తొట్లు అవసరమంటున్న పశు వైద్యులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎండలు విపరీతంగా పెరిగినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మనుషులపై వీధి కుక్కలు దాడి చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఉష్ణోగ్రత 40 సెల్సియస్ డిగ్రీలు దాటితే పశువులు, కుక్కలు సమ్మర్ స్ట్రెస్‌కు గురవుతాయని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. ప్రధానంగా సరైన తిండి, నీరు, నీడ కరువవుతుండడంతో వీధి కుక్కలు, వీధి పశువుల్లో ఈ తరహా లక్షణాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడిస్తున్నారు.
నీళ్లు కరువు..
గ్రామాలు మొదలు మున్సిపాలిటీల వరకు చాలాచోట్ల డ్రెయినేజీ వ్యవస్థ మెరుగైంది. అదేవిధంగా ఇంటింటికీ కుళాయిలు రావడంతో వీధి కుళాయిలు, బోర్ల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా ఇలాంటి నీటి వనరులపై ఆధారపడే వీధి కుక్కలకు తగినంత నీరు లభించని పరిస్థితి నెలకొంది. దీనికితోడు రోడ్ల విస్తరణ, కరెంటు వైర్ల కోసం చెట్లు నరికేయడం, రోడ్లపైనే వాహనాల పార్కింగ్ వంటి కారణాలతో సరైన నీడ కూడా లేకుండా పోతోంది. దీంతో కుక్కలు సమ్మర్ స్ట్రెస్‌కు లోనవుతున్నాయి. ఈ సమయంలో వాటికవే తగువు పెట్టుకుంటాయని, ఏ మాత్రం కవ్వించినా దాడి చేయడానికి వెనుకాడవని చెబుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు కుక్కలను రాయితో కొట్టడం, కళ్లలో కళ్లు పెట్టి చూడటం, బెదిరించినట్టుగా ప్రవర్తించడం సరికాదని సూచిస్తున్నారు.
ఉష్ణోగ్రతలతో ఒత్తిడి
ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే కుక్కలు ఒత్తిడికి లోనవుతాయి. దీంతో కలహించుకునే స్వభావం వాటిలో పెరుగుతుంది. ఈ సమయంలో ఎవరైనా టీజ్ చేసినట్టు వాటికి అనిపిస్తే దాడి చేస్తాయి. తాగునీటిని అందుబాటులో ఉంచడం ద్వారా కొంత మేర సమస్యను అదుపులోకి తీసుకురావొచ్చు.
– డాక్టర్ టి.అరుణభారతి,
పశు సంవర్థక శాఖ ఏడీ
మూలన పడిన ప్రతిపాదనలు
వేసవిలో వీధి కుక్కలతో పాటు పశువులకు సైతం నీరు అందించేందుకు గతంలో గ్రామాలు, పట్టణాల్లో కూడా నీటి తొట్లు(వాటర్ త్రోట్) ఉండేవి. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలతో పాటు కొన్ని సందర్భాల్లో స్థానికులు, జంతు ప్రేమికులు సైతం నీటిని అందుబాటులో ఉంచేవారు. కొన్నేళ్లుగా నీటి తొట్ల నిర్వహణ లేక చాలాచోట్ల కనుమరుగైపోయాయి. మరి కొన్ని చోట్ల ఉపయోగించలేని స్థితికి చేరుకున్నాయి. రెండేళ్ల క్రితం నీటి తోట్ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించాలని అన్ని జిల్లాల పశుసంవంర్థక శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వారు ప్రతిపాదనలు సిద్ధం చేసి సర్కారుకు అందించినా ఎలాంటి ప్రగతి కనిపించలేదు. ప్రస్తుతం మనుషులపై జరుగుతున్న కుక్కల దాడుల నేపథ్యంలోనైనా నీటి తోట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవువుతోంది.
Comments
Please login to add a commentAdd a comment