దగ్ధమవుతున్న వరికోత యంత్రం
సుజాతనగర్: వరికోత యంత్రం దగ్ధమైన సంఘటన సుజాతనగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక శివాలయం సమీపంలో సుజాతనగర్‌కు చెందిన ఓ కౌలు రైతు పొలంలో వరికోత కోస్తుండగా యంత్రంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఇంజన్‌లో మంటలు వ్యాపించగా, గమనించిన స్థానికులు నీళ్లు చల్లి అదుపుచేశారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన కరీంనగర్ జిల్లాకు చెందిన యంత్రం డ్రైవర్ రాజేష్‌కు గాయాలయ్యాయి. కాగా భారీగా నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు.
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
కరకగూడెం: మండలంలోని మోతె గ్రామంలో ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన మెంతిని శంకర్ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లోని విద్యుత్ తీగలకు షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు లేచాయి. దుస్తులు, సామగ్రి, ద్విచక్ర వాహనం, రూ. 50 వేల నగదు కాలి బూడిదయ్యాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సుమారు రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. గతేడాది భారీ వర్షాల కారణంగా తన పూరిల్లు నేలమట్టవ్వడంతో శంకర్ రేకుల ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నాడు. ఆ ఇల్లు కూడా దగ్ధం కావడంతో కుటుంబం వీధిన పడింది. ప్రభుత్వం ఆదుకుని సహాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య
అశ్వారావుపేటరూరల్: వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ పి.శ్రీకాంత్ కథనం ప్రకారం.. మండలంలోని పేరాయిగూడెం గ్రామ పంచాయతీ మోడల్ కాలనీకి చెందిన పొదిలి గౌరి(22)కు ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన గోపినాథ్‌తో వివాహం జరిగింది. భర్త లారీ డ్రైవర్‌గా కాగా, ఈ దంపతులకు మూడు నెలల బాబు ఉన్నాడు. కాగా భర్త అనుమానంతో వేధిస్తుండగా, తాళలేక కొద్ది రోజులు క్రితమే గౌరి తన పుట్టింటికి వచ్చింది. అయినా సరే భర్త వేధింపులు ఆగలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఆదివారం రాత్రి కుటుంబీకులంతా చర్చికి వెళ్లగా, వారంతా ఇంటికి వచ్చే సరికే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త గోపినాథ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment