ముక్కోటికి పెరిగిన టికెట్ల ఆదాయం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఈనెల 10వ తేదీన నిర్వహించిన ముక్కోటి ఏకాదశి వేడుకకు టికెట్ల ద్వారా ఆదాయం పెరిగింది. గతేడాది జరిగిన ముక్కోటికి టికెట్ల అమ్మకం ద్వారా రూ. 28,79,750 సమకూరగా, ఈ సంవత్స రం టికెట్ల విక్రయం ద్వారా రూ.34,77,750 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఆన్‌లైన్ టికెట్ల విక్రయం ముందుగానే ప్రారంభించడంతో పూర్తిగా అమ్ముడయ్యాయి. ఇక రెవెన్యూ శాఖ ద్వారా కొన్ని టికెట్లు విక్రయించారు. అయితే ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయి, వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని రెవెన్యూ అధికారులు ఇంకా ఆలయానికి చెల్లించలేదు. అది కూడా సమకూరితే ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంది.
పెద్దమ్మతల్లికి
భోగి పండ్లతో అభిషేకం
పాల్వంచరూరల్: మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో భోగి సందర్భంగా సోమవారం అర్చకులు అమ్మవారికి రేగుపండ్లు, పుష్పాలతో అభిషేకం చేశారు. అనంతరం యాగశాలలో చండీహోమం నిర్వహించారు. హోమంలో పాల్గొన్న 16 మంది దంపతులకు ఈఓ రజనీకుమారితో కలిసి అర్చకులు అమ్మవారి శేష వస్త్రాలు అందించారు.
కలెక్టర్ సంక్రాంతి శుభాకాంక్షలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకాంక్షించారు. సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో నూతన కాంతులు తీసుకురావాలని పేర్కొన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా మరో ప్రకటనలో ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఇల్లెందు : ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కోరం కనకయ్య సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ కూడా మరో ప్రకటనలో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
16న ఆర్చరీ క్రీడాకారుల ఎంపిక పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: జూనియర్ బాలబాలికల విభాగాల్లో ఉమ్మడి జిల్లాస్థాయి ఆర్చరీ క్రీడాకారుల ఎంపికకు ఈనెల 16న పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పుట్టా శంకరయ్య తెలిపారు. వివిధ అంశాల్లో ఎంపిక పోటీలు ఉంటాయని, ప్రక్రియను కోచ్‌లు గొంది మారప్ప, నగేష్, కల్యాణ్ పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే పోటీలకు క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో హాజరుకావాలని, వివరాలకు 93946 43139 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. ఇక్కడ ప్రతిభ చాటిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment