● లోగిళ్లలో రంగవల్లులు.. పల్లెలకు కొత్త శోభ ● ఊరూ..వాడ సందడే సందడి
రామవరంలో భోగి మంటలు వేసి సంబురాలు జరుపుకుంటున్న మహిళలు, చిన్నారులు
జిల్లాలో ఘనంగా భోగి వేడుకలు
చుంచుపల్లి/కొత్తగూడెంటౌన్ : భోగభాగ్యాల భోగి పండుగను జిల్లా వ్యాప్తంగా ప్రజలు సోమవారం సంబరంగా జరుపుకున్నారు. భోగి మంటలు వేయడంతో సకల దోషాలకు పరిహారం లభిస్తుందని నమ్మకం. పీడలు తొలిగిపోతాయనే నమ్మకంతో పాత వస్తువులను, పనికి రాని వస్త్రాలను మంటల్లో వేసి కాల్చేశారు. చెడు తలంపులను భోగి మంటల్లో వేసి, నూతన ఆలోచనలతో ముందుకు సాగాలని కోరుకున్నారు. ఇక ఇళ్ల లోగిళ్లలో రంగవల్లులు.. కొలువుదీరిన గొబ్బెమ్మలు.. ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతూ హరిదాసుల కీర్తనలు.. డూడూ బసవన్నల విన్యాసాలు.. ఇలా పల్లె, పట్టణం తేడా లేకుండా అంతటా సందడి వాతావరణం నెలకొంది.
ముచ్చటగా మూడు రోజులు..
జిల్లాలో సంక్రాంతి సంబరాలు సరికొత్త శోభ సంతరించుకున్నాయి. సోమవారం భోగి వేడుకలు ముగియగా, మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ పండుగలు జరుపుకోనున్నారు. ఇంటిముందు అందమైన ముగ్గులు వేసి వాటి మధ్య గొబ్బెమ్మలను పెట్టి పూజిస్తారు. వాటిని గోదాదేవి, లక్ష్మీదేవి, గౌరీమాతగా భావిస్తారు. భోగి పండుగ సందర్భంగా చిన్నారుల తలపై రేగుపండ్లు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment