ఆర్టీసీ రికార్డు బ్రేక్!
12 2.50
● ఈనెల 12న 2.50 లక్షల మంది ప్రయాణం ● రీజియన్‌లోని ఏడు డిపోల పరిధిలో రాకపోకలు ● వారం రోజుల్లో ప్రయాణించిన 16లక్షల మంది..
ఖమ్మంమయూరిసెంటర్: సంక్రాంతి పండుగ సందర్భంగా నగరాలు, పట్టణాల నుండి స్వస్థలాలకు బయలుదేరిన లక్షలాది మంది ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. వారం రోజుల్లో 16.32లక్షల మందికి పైగా ప్రయాణికులు ఖమ్మం రీజియన్‌లోని ఏడు డిపోల పరిధి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. అత్యధికంగా ఈనెల 12న ఆదివారం ఒకేరోజు 2.50 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించడం రికార్డుగా నమోదైంది. మునుపెన్నడూ ఈ స్థాయిలో ప్రయాణికుల సంఖ్య నమోదు కాలేదని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. సంక్రాంతి రద్దీకి అనుగుణంగా అధికారులు ముందుగానే ప్రణాళికాయుతంగా బస్సులు ఏర్పాటుచేసి పర్యవేక్షించడంతో ప్రయాణం సాఫీగా సాగింది. వారం రోజులుగా ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి చేసిన కృషిని అంతా అభినందిస్తున్నారు. కాగా, 12వ తేదీన ఆదివారం ఒకేరోజు ఖమ్మం డిపోకు గరిష్ట స్థాయిలో రూ.48,57,372 ఆదాయం సమకూరడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment