వైభవంగా గోదా రంగనాథుల కల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో సోమవారం భోగి పండుగను పురస్కరించుకుని గోదాదేవి – రంగనాథస్వామి వార్ల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. మొదట శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులకు అంతరాలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడా మండపానికి తీసుకొచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని, గోదా రంగనాథస్వామి వార్ల కల్యాణ వేడుకను కమనీయంగా జరిపించారు. సోమవారం సందర్భంగా అంతరాలయంలో మూలమూర్తులు ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. సంక్రాంతి సెలవులు కావడంతో రామాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆర్జిత సేవల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాపికొండల పర్యాటకానికి సైతం బారులుదీరారు.
రామయ్యకు ఘనంగా రాపత్తు సేవ..
అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం తాతగుడి సెంటర్‌లో ఉన్న గోవిందరాజ స్వామి ఆలయంలో రామచంద్రస్వామి వారికి ఘనంగా రాపత్తు సేవ జరిపారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామి వారిని మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీరామనామస్మరణల నడుమ పల్లకీ సేవగా ఆలయం వద్దకు తీసుకొచ్చి కొలువుదీర్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గోవిందరాజస్వామి ఆలయంలో రాపత్తు సేవ
Comments
Please login to add a commentAdd a comment