పవర్‌ప్లాంట్ రెడీ..
● పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద
నేడు ప్రారంభోత్సవం
● హాజరుకానున్న డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రులు తుమ్మల, పొంగులేటి, కోమటిరెడ్డి
● ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
అశ్వారావుపేటరూరల్: పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద నూతనంగా నిర్మించిన పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం, రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల సదస్సుకు అంతా సిద్ధమైంది. విజయదశమి రోజు నిర్వహించే ఈ కార్యక్రమాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మిన్ భాషా, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు తదితరులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, ప్లాంట్స్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, డివిజనల్ మేనేజర్ ఆకుల బాలకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం తర్వాత నిర్వహించే శాస్త్రవేత్తలు, పామాయిల్ రైతుల ముఖాముఖి కార్యక్రమానికి వేదికతోపాటు, రాష్ట్రం, జిల్లా నుంచి తరలి వచ్చే పామాయిల్ రైతులు, ఇతర ప్రముఖులు, ఆయిల్‌ఫెడ్, వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. పామాయిల్ ఉత్పత్తులతోపాటు, వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ప్రత్యేక స్టాళ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, మొగళ్లపు చెన్నకేశవరావు, బండి భాస్కర్, సుంకవల్లి వీరభద్రరావు, ఆయిల్‌ఫెడ్ ఆడ్వైజరి మెంబర్ ఆలపాటి రామచంద్రప్రసాద్, తుమ్మా రాంబాబు, జ్యేష్ట సత్యనారాయణ చౌదరి, ఎస్‌కే బాజీ పరిశీలించారు.
ఏడాదికి రూ. 2 కోట్ల ఆదా..
పామాయిల్ ఫ్యాక్టరీలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చేసిన వినతి మేరకు 2.50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా రూ.36 కోట్ల వ్యయంతో పవర్ ప్లాంట్‌ను మంజూరు చేశారు. నిర్మాణ పనులకు ఎమ్మెల్యే హోదాలో ఏడాది క్రితం మెచ్చా శంకుస్థాపన చేయగా, కొద్ది రోజుల క్రితమే పూర్తిస్థాయి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పామాయిల్ ఫ్యాక్టరీలో గానుగ ఆడిన తర్వాత వచ్చే గెలలు, పీచు పదార్థాలను ప్రత్యేక బాయిలర్ ద్వారా స్ట్రీమ్ చేసి తద్వారా 2.50 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఈ పవర్ ప్లాంట్ ద్వారా ఆయిల్‌ఫెడ్‌పై ఏడాదికి దాదాపు రూ.2 కోట్ల మేర విద్యుత్ చార్జీల భారం తగ్గుతోంది. ఫ్యాక్టరీకి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయవచ్చు. దీంతో ఆయిల్‌ఫెడ్‌కు భారం తగ్గడంతోపాటు, విద్యుత్ కోత ఇబ్బందులు తొలగిపోతాయి.
Comments
Please login to add a commentAdd a comment