రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ టోర్నీ ప్రారంభం
● ఖమ్మంలో అండర్–14 బాలబాలికల పోటీలు ● ఉమ్మడి పది జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారులు
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–14 బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలు ఖమ్మంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో పోటీలను ఖమ్మం డీఈఓ సోమశేఖరశర్మ ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే పోటీలకు పాత పది జిల్లాల నుంచి 320 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈసందర్భంగా ఖమ్మం డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు కీడల్లోనూ రాణించాలని, తద్వారా ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా క్రీడాకారులు ఉండడం.. నేటి తరం కూడా క్రీడలపై ఆసక్తి చూపుతుండడం మంచి పరిణామమని తెలిపారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ ఏటా ఖమ్మం జిల్లాలో అథ్లెటిక్స్ మీట్ నిర్వహిస్తుండగా మంచి స్పందన వస్తోందని చెప్పారు. జిల్లా పాఠశాలల క్రీడల సంఘం కార్యదర్శి కె.నర్సింహామూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసోసియేషన్ బాధ్యులు డి.ప్రసాద్, నున్నా రాధాకృష్ణ, మందుల వెంకటేశ్వర్లు, ఎండీ.షఫీక్ అహ్మద్, కోచ్ ఎండీ.గౌస్‌తో పాటు పి.రవిమారుత్, డాక్టర్ కూరపాటి ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.
తొలిరోజు విజేతలు వీరే..
రాష్ట్రస్థాయి అథ్లెటిక్ టోర్నీలో తొలిరోజు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలుర 600 మీటర్ల పరుగు పందెంలో కె.జకేష్(ఆదిలాబాద్), కె.లోకేష్(వరంగల్), ఎం.చరణ్(వరంగల్), బాలికల విభాగంలో ఎం.రాజేశ్వరి(వరంగల్), ఎం.డీ.సమీరా(కరీంనగర్), టి.పల్లవి(రంగారెడ్డి), లాంగ్‌జంప్‌లో అన్విత(రంగారెడ్డి), శృతిహాసన్(ఖమ్మం), ధన్యశ్రీ(హైదరాబాద్), బాలుర షాట్‌ఫుట్‌లో జె.సాత్విక్(ఆదిలాబాద్), బి.నరేష్(ఖమ్మం), వంశీ(మహబూబ్‌నగర్) వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment