బిర్సా ముండాను స్ఫూర్తిగా తీసుకోవాలి
భద్రాచలంఅర్బన్: పాతికేళ్లు మాత్రమే జీవించిన బిర్సా ముండా హక్కుల కోసం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి, ఆదివాసీల ఆరాధ్య దైవంగా మారాడని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. శుక్రవారం భద్రాచలం ఐటీడీఏ సమావేశం మందిరంలో బిర్సా ముండా జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ధర్తీ అభా జన్‌జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకం గురించి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిర్సా చాయిబాసాలోని మిషనరీ స్కూల్లో చదువుకునేందుకు క్రైస్తవంలోకి మారాడని, చదువుకుంటూనే అడవి మీద ఆధారపడే ఆదివాసీల హక్కుల కోసం పోరాడాడని గుర్తుచేశారు. కుంతి, తామర్ భాషీయా, రాంచి ప్రాంతాలను సరిహద్దులుగా చేసుకుని మిలిటెంట్ ఉద్యమాన్ని నడిపాడని కొనియాడారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని నేటి ఆదివాసీ యువత అభివృద్ధికి కంకణం కట్టాలని, సంస్కృతీ సంప్రదాయాలు కాపాడుకోవాలని చెప్పారు. గిరిజన విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడల్లో సత్తా చాటి జిల్లాకు ఓరల్ చాంపియన్‌షిప్‌లు సాధించడం అభినందనీయమని అన్నారు. జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు సందర్శించేలా బెండాలపాడు, తుమ్మలచెరువు, దామరతోగు, అటుకులపాడు గ్రామాలను పర్యాటక దర్శనీయ స్థలాలుగా గుర్తించామని చెప్పారు. ఆదివాసీ గ్రామాల్లో బస చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ట్రైకార్ జీఎం శంకర్‌రావు మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో ఐటీడీఏ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఆదివాసీ అభివృద్ధికి జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించుకోవాలన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే చేసిందని పేర్కొన్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలకు ఎదురొడ్డి పోరాడిన ఆదివాసీ ముద్దు బిడ్డ బిర్సా ముండా అని అన్నారు. సమసమాజం కోసం, ఆర్థిక జీవన ప్రమాణాల పెరుగుదల కోసం పాటుపడాడ్డడని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్, బిర్సా ముండా వంటి మహనీయులు పోరాటం ఫలితంగా 1/70 చట్టం, పీసా చట్టం, అటవీ భూములలో పోడు తదితర అవకాశాలు కలిగాయన్నారు. అనంతరం పలువురు విద్యార్థులు ఆదివాసీ నృత్యాలతో అలరించారు. ఓ విద్యార్థి కలెక్టర్ బొమ్మను గీసి, ఆయనకు బహుకరించారు.
వైటీసీలో కలెక్టర్, ఎమ్మెల్యేలు
భద్రాచలం ఐటీడీఏ ఆవరణలోని వైటీసీని కలెక్టర్ జితేష్ వి.పాటిల్, భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మట్టి ఇటుకల తయారీని విధానాన్ని ఎమ్మెల్యేలకు వివరించారు. ఈ ఇటుకలతో తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం పూర్తవుతుందని, పర్యావరణానికి సైతం కూడా మేలు జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే రమ్మిడి ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యాన రెండు రోజుల పాటు శిక్షణ ఇప్పించామని చెప్పారు. ఈమేరకు ఎమ్మెల్యేలు స్పందిస్తూ ఈ ఇటుకలతో ఒక ఇంటిని నిర్మిస్తే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవలంబించేలా ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డీఆర్‌డీఓ విద్యాచందన, డీఎంహెచ్‌ఓ భాస్కర్ నాయక్, ఐటీడీఏ అధికారులు డేవిడ్ రాజ్, మణెమ్మ, తానాజీ, రాంబాబు, రమణయ్య, అలివేలు మంగతాయారు, తహసీల్దార్ శ్రీనివాస్, సీఐ సంజీవరావు పాల్గొన్నారు.
ఆదివాసీ యువత అభివృద్ధికి కంకణం కట్టుకోవాలి
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
Comments
Please login to add a commentAdd a comment