ముష్టి గింజలతో కాసుల పంట
● ధర భారీగా పెంచిన జీసీసీ ● కిలో రూ.45 నుంచి రూ.75కు పెంపు ● సేకరించే ఆదివాసీ, గిరిజనులకు అధిక లాభాలు ● సేకరణ లక్ష్యం నిర్దేశించిన అధికారులు
ఇల్లెందు: అటవీ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా అడవి నుంచి సేకరించే ముష్టిగింజల ధరలు గణనీయంగా పెంచారు. గిరిజన సహకార సంస్థ ద్వారా డీఆర్ డిపోలు ఈ ముష్టిగింజలు కొనుగోలు చేస్తుంటాయి. కిలో ధర రూ.45 ఉండగా దీన్ని రూ.75కు పెంచారు. దీంతో ముష్టి గింజలు సేకరిస్తే కాసుల పంట పండనుంది. జీసీసీ భద్రాచలం డివిజన్ పరిధిలో ఐదు బ్రాంచ్‌లు ఉన్నాయి. ఇందులో భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, దమ్మపేట ఉండగా 149 డీఆర్ డిపోలు ఉన్నాయి. ముఖ్యంగా ఇల్లెందు డిపో పరిధిలో 8 మండలాలు ఉండగా గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి, బయ్యారం మండలాల పరిధిలో ఈ ముష్టి గింజల ఉత్పత్తి ఉంది. ఈ మండలాల పరిధిలోని డీఆర్ డిపోల పరిధిలో ముష్టి గింజల సేకరణ సాగుతోంది. ఇక భద్రాచలం డివిజన్ పరిధిలోని మణుగూరు బ్రాంచ్ పరిధిలో పినపాక మండలంలో కూడా ముష్టిగింజల సేకరణ ఉంటుంది. పాల్వంచ, దమ్మపేట మండలాలలో పాక్షికంగానే లభ్యమవుతాయి.
3 వేల క్వింటాళ్ల లక్ష్యం..
జీసీసీ పరిధిలో ఈ దఫా సుమారు 3 వేల క్వింటాళ్ల ముష్టిగింజలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నవంబర్ నుంచి జనవరి వరకు ముష్టి గింజలు లభిస్తాయి. చెట్లు నరకకుండా వీలైనంతగా కింద పడిన ముష్టి కాయలను సేకరించి అందులోని గింజలను వెలికి తీసి ఆరబెట్టి డీఆర్ డిపోలకు తరలిస్తే కిలోకు ఽరూ.75 చెల్లిస్తారని జీసీసీ అధికారులు చెబుతున్నారు. గిరిజనులు ముఖ్యంగా అడివిపై ఆధార పడి జీవనోపాధి పొందే ఆదివాసీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. కేవలం నిత్యావసర సరుకులు, హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలకు సరుకులు సరఫరా చేసే జీసీసీ.. అటవీ ఉత్పత్తుల సేకరణపై దృష్టి సారించింది. ఇప్పటికే ఆయా బ్రాంచ్‌ల పరిధిలోని సేల్స్‌మెన్‌లతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సీజన్‌లో అడవుల్లో లభించే ఉత్పత్తుల సేకరణలో నిమగ్నం కావాలంటూ లక్ష్యాన్ని నిర్దేశించారు. కాగా, ఈ గింజలను పురుగుమందుల తయారీలో ఉపయోగిస్తారని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment