మేళవింపుతోనే మేలు.. | - | Sakshi
Sakshi News home page

మేళవింపుతోనే మేలు..

Published Fri, Dec 20 2024 12:17 AM | Last Updated on Fri, Dec 20 2024 12:17 AM

మేళవి

మేళవింపుతోనే మేలు..

● ఆధ్యాత్మిక, ఆదివాసీ సంస్కృతుల కలబోతకు కసరత్తు ● మ్యూజియం ప్రాంగణంలో ‘గిరిజన పల్లె’ ● ఆదివాసీ వంటకాలతో పర్యాటకులకు స్వాగతం ● కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ప్రత్యేక చొరవ

భద్రాచలం: శ్రీ సీతారాముల దర్శనానికి వచ్చే వివిధ ప్రాంతాల భక్తులకు స్థానిక గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేసేందుకు కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌తో కలిసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు చకచకా పనులు జరుగుతున్నాయి. అయితే భద్రాచలంలో జరిగే అభివృద్ధిలో ఆధ్యాత్మిక, గిరిజన సంస్కృతిని మేళవించాలని కోరుతున్నారు.

ప్రచారం.. ప్రయాణం

భద్రాచలం చుట్టుపక్కల అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నా సరైన ప్రచారం, రవాణా సౌకర్యాలు లేక అవి ఆదరణ కోల్పోతున్నాయి. ప్రస్తుతం నిర్మిస్తున్న గిరిజన పల్లె కూడా వాటి సరసన చేరకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. ఉదాహరణకు సీతారాముల దర్శనం తర్వాత పాపికొండలు టూర్‌కి వెళ్లాలనుకునే భక్తులకు ఆలయం వెలుపల గిరిజన సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి. ఇక్కడ పాపికొండలు టూర్‌కు బోట్‌ టికెట్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. అవసరమైతే ఈ సొసైటీ ద్వారానే అదనపు చార్జీలతో రవాణా సౌకర్యం కూడా కల్పిస్తారు. అలాగే కొత్తగా నిర్మిస్తున్న గిరిజన పల్లెకు ఆలయ పరిసర ప్రాంగణంలో ప్రచారం కల్పించాలి. గిరిజన పల్లెకు వెళ్లేందుకు వాహనాలు (ప్రీ పెయిడ్‌ ట్యాక్సీ) అందుబాటులో ఉంచాలి. ఒకసారి భక్తులు, పర్యాటకులు గిరిజన పల్లెకు రావడం మొదలై, సానుకూల జన వాక్కు బలపడితే ఆ తర్వాత ప్రత్యేక ఏర్పాట్లు లేకపోయినా పర్యాటకుల రాకకు ఢోకా ఉండదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రత్యేక దృష్టి పెట్టిన కలెక్టర్‌..

పర్యాటక పరంగా భద్రాచలం అభివృద్ధితో పాటు ఇక్కడి గిరిజన సంస్కృతికి ప్రాచుర్యం కల్పించడంపై కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో వివిధ యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఇక్కడికి ఆహ్వానించారు. పంచతంత్ర స్టూడియో, రైస్‌ వాటర్‌ ప్రాజెక్టు ప్రతినిధులచే డాక్యుమెంటరీ చిత్రీకరించారు. మరోవైపు బలవర్థకమైన ఆదివాసీ వంటకాలను పర్యాటకులకు, భక్తులకు పరిచయం చేసేలా ప్రచారం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో భద్రాచలం పర్యటనకు వచ్చే వీఐపీలందరికీ ఐటీడీఏ ప్రాంగణంలో గిరిజన మహిళలు తయారు చేయించిన వంటకాలను రుచి చూపిస్తున్నారు.

థీమాటిక్‌ క్యాంపెయిన్‌

భద్రాచలం పట్టణం ఓ వైపు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటూనే మరోవైపు ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసీ గిరిజన సంస్కృతులకు కేంద్రంగా ఉంది. దీనికి తగ్గట్టుగా ప్రస్తుతం భద్రాచలంలో జరుగుతున్న పనులకు రాజస్థాన్‌లోని జైపూర్‌ తరహాలో థీమాటిక్‌ క్యాంపెయిన్‌ జోడిస్తే బాగుంటుదని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గోదావరి వంతెన తర్వాత చెక్‌పోస్టు నుంచి అంబేద్కర్‌ సెంటర్‌, రాజీవ్‌ సెంటర్‌, తాతగుడి సెంటర్‌, బ్రాహ్మణబజార్‌లతో పాటు ఫైర్‌ స్టేషన్‌ నుంచి సబ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌ మీదుగా ఆలయం వరకు ఉన్న ప్రాంగణాల్లో రామాయణం థీమ్‌తో పెయింటింగ్‌, కూడళ్లలో రామాయణ ఇతివృత్తం తెలిపే ప్రతిమలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఇక జూనియర్‌ కాలేజీ రోడ్డు నుంచి ఐటీడీఏ ప్రాంగణం, కూనవరం, చర్ల రోడ్లలో గిరిజన సంస్కృతి కళ్లకు కనిపించేలా సరికొత్త సొబగులు అద్దాలంటున్నారు. దీంతో పాటు ఐటీడీఏ మ్యూజియం ప్రాంగణంలో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో ఆదివాసీ వస్తువులు, పరికరాలు, జీసీసీ ద్వారా సేకరించిన తేనే, స్వయం ఉపాధి ద్వారా తయారు చేస్తున్న షాంపులు, సబ్బులు, పౌష్టికాహార పదార్థాలను విక్రయించాలని అంటున్నారు. తద్వారా గిరిజన ఉత్పత్తులకు ప్రచారం పెరగటంతో పాటు వారు ఆర్థికాభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

మ్యూజియంలో ‘గిరిజన పల్లె’..

ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న గిరిజన మ్యూజియంలో ‘గిరిజన పల్లె’ను తీర్చిదిద్దుతున్నారు. బిహార్‌ నుంచి వచ్చిన కూలీలు వెదురుతో గుడిసె, మట్టి ఇల్లు, మంచె వంటి గిరిజన ఇళ్ల నమూనా ఉండేలా నిర్మిస్తున్నారు. పర్యాటకులు వీటిలోనే కూర్చుని గిరిజన పల్లె అందాలను వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఆదివాసీ వంటకాలను పర్యాటకులకు రుచి చూపేందుకు ప్రత్యేకంగా ఇదే ప్రాంగణంలో కుటీర నిర్మాణానికి బడ్జెట్‌ కేటాయించారు. ఈ పనులన్నీ జనవరి 9, 10 తేదీల్లో జరిగే తెప్పోత్సవం, ముక్కోటి నాటికి పూర్తి చేసి, అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మేళవింపుతోనే మేలు..1
1/1

మేళవింపుతోనే మేలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement