స్వర్ణ కవచధారణలో రామయ్య...
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
రామయ్య నిత్యాన్నదానానికి విరాళం
భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి శుక్రవారం కొత్తగూడేనికి చెందిన కోడూరి రవికుమార్–స్వప్న దంపతులు రూ.లక్ష చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పీఆర్వో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు.
ఆశ్రమ పాఠశాల
విద్యార్థులకు అస్వస్థత.?
అశ్వారావుపేటరూరల్: మండలంలోని అనంతారం గ్రామంలో ఉన్న ఐటీడీఏ ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాలలో కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు శుక్రవారం ప్రచారం జరిగింది. పాఠశాలకు చెందిన విద్యార్థిని గురువారం రాత్రి వాంతులు, కీళ్ల నొప్పులతో అస్వస్థతకు గురికావడంతో ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడులో ఉన్న ఓ ఆస్పత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లి వైద్యం చేయించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆశ్రమ పాఠశాలలోని మరికొందరు విద్యార్థినులు కూడా అస్వస్థతకు గురైనట్లు ప్రచారం జరిగింది. దీంతో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ ఘటనపై ఎంపీడీఓను వివరణ కోరగా.. ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు ఫేక్ ప్రచారం జరిగిందని, విద్యార్థులు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.
అంతుచిక్కని పెద్దపులి జాడ..
కరకగూడెం: గడిచిన రెండు వారాల నుంచి మండల వాసులకు పెద్ద పులి భయం వెంటాడుతోంది. కొన్ని రోజుల కిందట మండలంలోని రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో సంచరించి తిరిగి సరిహద్దు ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలోకి వెళ్లిన పెద్దపులి తాజాగా మూడు రోజుల కిందట తిరిగొచ్చింది. అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు పలు గ్రామాల్లో డప్పు చాటింపు వేయించి సుమారు 10 రోజుల వరకు ప్రజలెవ్వరూ కూడా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని సూచించారు. పినపాక, కరకగూడెం మండలాల పరిధిలోని పలు అటవీ ప్రాంతాల్లో పులి జాడ కోసం నాలుగు బృందాలు ముమ్మరంగా అడవులను జల్లెడ పట్టాయి. శుక్రవారం మండలంలోని మోతె ఎర్రచెరువు సమీపంలో పులి పాదముద్రలను గ్రామస్తులు చూసినట్లు సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి వెళ్లి పరిశీలించగా అవి పులి పాదముద్రలు కావని నిర్ధారించినట్లు మణుగూరు డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ మక్సూద్ మొహినొద్దీన్ ‘సాక్షి’కి తెలిపారు. పెద్ద పులి తిరిగి సరిహద్దు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని బంధాల రిజర్వ్ ఫారెస్టులోకి వెళ్లినట్లు చెప్పారు. అక్కడి అటవీశాఖ అధికారులు కూడా పులి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment