స్వర్ణోత్సవాలకు సిద్ధం
●పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 50 ఏళ్లు ●కాలేజీ నాటి ప్రాభవం కోల్పోయి సమస్యలతో సహవాసం
ఏపీఎస్‌ఈబీ ప్రభుత్వ జూనియర్ కళాశాలను పాల్వంచ పట్టణంలోని యాష్ కాలనీలో కేటీపీఎస్ ఆధ్వర్యంలో నిర్మించారు. 1974, జనవరి 15న అప్పటి సీఎం జలగం వెంగళరావు, అప్పటి విద్యాశాఖమంత్రి మండలి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే చేకూరి కాశయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఇంటర్మీడియట్ ఆర్ట్స్, సైన్స్ గ్రూపులతోపాటు ఒకేషనల్ కోర్సులు కూడా నిర్వహించారు. దాదాపు 2010వరకు ఏటా ఆరు, ఏడు వందల మంది విద్యార్థులు చదువుకునేవారు. పాల్వంచతోపాటు చుట్టు పక్కల మండలాల విద్యార్థులందరూ ఇదే కళాశాల కు వచ్చేవారు. 90 దశకం నుంచి ప్రైవేటు జూనియ ర్ కళాశాలలు ఉన్నా ఎక్కువ మంది ప్రభుత్వ కళాశాలలో చేరేందుకే మక్కువ చూపేవారు. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ఇక్కడి విద్యార్థులు ఫలితాలు సాధించేవారు. మెరిట్ ఉంటే తప్ప కళాశాలలో సీటు దొరకని పరిస్థితి కూడా ఉండేది.
ఇక్కడి పూర్వ విద్యార్థులు ఐఏఎస్‌లు, ఎన్‌ఐఆర్‌లుగా..
ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దింది. ఇక్కడ చదువుకున్న చంపలాల్, భారతి నాయక్ ఐఏఎస్‌లుగా ఎదిగారు. గిరిధర్ ఐఎఫ్‌ఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. ఇంకా అనేకమంది ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారు. జిల్లాలో పనిచేస్తున్న వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో పలువురు ఈ కళాశాల పూర్వ విద్యార్థులే.
ప్రస్తుతం వేధిస్తున్న సమస్యలు
ప్రస్తుతం కళాశాలను సమస్యలు పీడిస్తున్నాయి. గతంలో సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో 30 గదులతో కళాశాల భవనం ఉండేది. ప్రస్తుతం 8 గదులతో 1.10 ఎకరాల స్థలంతో కళాశాల కొనసాగుతోంది. ఇందులో రెండు గదులు ప్రిన్సిపాల్‌కు, స్టాఫ్‌నకు కేటాయించగా, మిగిలిన ఆరు గదుల్లోనే ఆర్ట్స్, సైన్స్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. మరో రెండెకరాల స్థలం కేటాయించినా భవనాలు నిర్మించలేదు. తగిన సంఖ్యలో తరగతి గదులు లేకపోవడంతో క్లాస్ రూమ్‌లనే ల్యాబ్‌లుగా ఉపయోగించుకుంటున్నారు. ల్యాబ్ సామగ్రి వరండాలో ఉంచా ల్సిన పరిస్థితి నెలకొంది. క్రీడా మైదానం కూడా లేకపోవడంతో విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కేటీపీఎస్ యాజమాన్యం స్పందించి కళాశాలలో అదనపు తరగతి గదులు, ల్యాబ్స్, క్రీడామైదానం నిర్మించాలని విద్యార్థులు, అధ్యాపకులు వేడుకుంటున్నారు. ఉన్నతస్థాయిలో స్థిరపడ్డ పూర్వవిద్యార్థులు కూడా సహకరించాలని కోరుతున్నారు.
పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాలకు సిద్ధమైంది. కాలేజీని స్థాపించి 50 ఏళ్లు కావడంతో గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నారు. అర్ధశతాబ్ద కాలంలో ఇక్కడ చదువుకుని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ పలువురు పూర్వవిద్యార్థులు ఈ వేడుకకు తరలిరానున్నారు. ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఇతర సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే కళాశాల ప్రాభవం కోల్పోయి సమస్యలతో సతమతమవుతోంది. –పాల్వంచరూరల్
నేడు వేడుకలు
నేడు (ఆదివారం) స్వర్ణోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ముఖ్యఅతిథులుగా ఖమ్మం ఎంపీ ఆర్.రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ బి.రోహిత్‌రాజ్, డీఐఈఓ వెంకటేశ్వరరావు హాజరవుతారని ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు.
కేటీపీఎస్ ఏడో దశ కోసం భవనం కూల్చివేత
ఇంతటి ప్రాశస్త్యం కలిగిన జూనియర్ కళాశాలను ఏడో దశ కర్మాగారం ఏర్పాటు కోసం పదేళ్ల క్రితం కేటీపీఎస్ యాజమాన్యం కూల్చివేసింది. మరో చోట స్థలం సేకరించకుండా చెక్కు చెదరని భవనాన్ని నేలకూల్చి ఆ పునాదులపై కర్మాగారం నిర్మించింది. ఆ తర్వాత పాల్వంచ మండలం బస్వతారాక కాలనీ గ్రామపంచాయతీలో ప్రస్తుతం ఉన్న భవనాన్ని నిర్మించింది. 2014 వరకు కళాశాల యాష్ కాలనీలో కొనసాగగా, కొత్త భవన నిర్మాణ సమయంలో 2014 నుంచి 2015 వరకు లక్ష్మీదేవిపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలో తాత్కాలికంగా కొసాగించారు. 2016 జనవరిలో సొంత భవనంలోకి తరలించారు. ప్రస్తుతం కళాశాలలో 420 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment