కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సింగరేణి(కొత్తగూడెం)/సుజాతనగర్: ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా, అసంబద్ధంగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర నాయకుడు కాసాని ఐలయ్య అన్నారు. ఆదివారం కొత్తగూడెంలోని మంచికంటిభవన్, సుజాతనగర్‌లోని చింతలపూడి సత్యం భవన్‌లో నిర్వహించిన పార్టీ సమావేశాల్లో వారు మాట్లాడారు. చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా ప్రకటన చేయటం హేతుబద్ధంగా లేదన్నారు. ఏజెన్సీ సమస్యతో పాల్వంచ మున్సిపాలిటీలో ఇప్పటివరకు ఎన్నికలు జరగడం లేదని పేర్కొన్నారు. పాల్వంచను కార్పొరేషన్‌లో కలపటం వల్ల ఇప్పటికే పాలకవర్గం ఉన్న కొత్తగూడెం, సుజాతనగర్‌ల్లో ఎన్నికలు జరపకుండా అఽధికారుల పాలన తీసుకురావటమే ప్రభుత్వ ఉద్దేశమా? అని ప్రశ్నించారు. అభివృద్ధి కోసమైతే కొత్తగూడేనికి ఇరువైపులా ఉండి అభివృద్ధి చెందుతున్న చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాలను వదిలేసి సుజాతనగర్, పాల్వంచ మండలాలు కలపటం భౌగోళికంగా కూడ లోపభూయిష్టమేనన్నారు.
ఏడు పంచాయతీలను కలపొద్దు
సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామపంచాయతీలను కార్పొరేషన్‌లో కలపొద్దన్నారు. కార్పొరేషన్‌లో కలిపితే ఏడు పంచాయతీల్లో సుమారు 1,500 మంది వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ పని కోల్పోతారని అన్నారు. ఇంటి పన్నులు పెరుగుతాయన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఏకపక్షంగా ప్రజలకు నష్టం చేసే నిర్ణయాలు సరికాదన్నారు. ఈ సమావేశాల్లో సీపీఎం నాయకులు అన్నవరపు కనకయ్య, లిక్కి బాలరాజు, వీర్ల రమేష్, కాట్రాల తిరుపతిరావు, బచ్చలకూర శ్రీనివాసరావు, గూని నాగచందర్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజనులకు నష్టం
పాల్వంచ: కొత్తగూడెం, పాల్వంచలను కార్పొరేషన్‌గా మారిస్తే గిరిజనులకు నష్ట జరగుతుందని లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు కుశ నాయక్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నిర్ణయం గిరిజనుల అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ వ్యవస్థ బడాబాబుల కోసమేనని, మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగినా కూడా పాల్వంచకు ఒరిగేదేమి ఉండదని అన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు
Comments
Please login to add a commentAdd a comment