ముంబై: కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో కుటుంబాలపై రుణ భారాలు తీవ్రమయ్యాయని ఎస్‌బీఐ రిసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదిక ప్రకారం.. 2019–20 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కుటుంబాల రుణ భారం 32.5 శాతం అయితే, ఇది తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరంలో 37.3 శాతానికి పెరిగింది. నిజానికి 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు, 2017 జూలైలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు వంటి ఆర్థిక పరిణామాలు చోటుచేసుకున్న కాలం నుంచి జీడీపీలో కుటుంబాల రుణ భారాల నిష్పత్తి పెరుగుతూ వస్తోంది.
రుణాల్లో ఏమున్నాయంటే...
బ్యాంకులు, క్రెడిట్ సొసైటీలు, నాన్ బ్యాంకింగ్ ఫై నాన్స్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వం టి ఫైనాన్షియల్ సంస్థల నుంచి రిటైల్‌సహా వ్యవ సాయ, వ్యాపార రుణాలు ఈ కేటగిరీ కిందకు వస్తాయి.
అగ్ర దేశాలకన్నా తక్కువే!
జీడీపీలో కుటుంబ రుణ భారాల నిష్పత్తి ప్రస్తుత ఆర్థిక మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక అంచనావేస్తోంది. ఆరోగ్య భద్రతా వ్యయాలు కూడా గణనీయంగా పెరుగుతుండడం గమనించాల్సిన అంశమని ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య క్రాంతి ఘోష్ పేర్కొన్నారు. అయితే జీడీపీలో కుటుంబాల రుణ నిష్పత్తి 37 శాతం అంటే మిగిలిన పలు దేశాలకన్నా ఇది తక్కువేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కొరియా (103.8 శాతం), బ్రిటన్ (90 శాతం), అమెరికా (79.5 శాతం), జపాన్ (65.3 శాతం), చైనా (61.7 శాతం)లను ఈ సందర్భంగా ప్రస్తావించారు. మెక్సికోలో ఇది కనిష్ట స్థాయిలో 17.4 శాతం.
డిపాజిట్ల తీరు ఇలా...
2020–21లో బ్యాంక్ డిపాజిట్లు తగ్గడం ఇక్కడ ప్రస్తావనాశం. 2020 లాక్‌డౌన్ ప్రారంభంలో వ్యయాలు ఏవీ లేక అన్ని వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లు భారీగా పెరిగాయి. అయితే పండుగల కాలంలో క్రమంగా తగ్గాయి. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) దేశ వ్యాప్త కఠిన లాక్‌డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2020 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో కుటుంబాల పొదుపు రేటు (జీడీపీలో) 10.4 శాతంగా ఉంది.
అయితే ఇది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 8.2 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో కుటుంబాల బ్యాంక్ డిపాజిట్ల రేషియో 7.7 శాతం నుంచి 3 శాతానికి తగ్గింది. ఇక కుటుంబాల రుణ భారం జీడీపీ విలువతో పోల్చితే 37.1 శాతం నుంచి 37.9 శాతానికి పెరిగింది. డిపాజిట్లు, లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్స్, ప్రావిడెంట్ అండ్ పెన్షన్ ఫండ్స్, కరెన్సీ, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, ఈక్విటీలు, స్మాల్ సేవింగ్స్‌సహా ఫైనాన్షియల్ అసెట్స్ విలువ 7,46,821.4 కోట్ల నుంచి 6,93,001.8 కోట్లకు పడిపోయింది. ఇక మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇటీవల నివేదిక ప్రకారం భారత్‌లో 2020 మహమ్మారి విసిరిన సవాళ్లలో ప్రైవేటు రంగమే 80 శాతం ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంది. ప్రైవేటు రంగం 80 శాతం ఆర్థిక నష్టం ఎదుర్కొంటే, ఇందులో కార్పొరేట్ రంగానికి కేవలం 12 నుంచి 16 శాతం. మిగిలినది కుటుంబాలు భరించాయి.
Comments
Please login to add a commentAdd a comment