డీజిల్‌పై ఇప్పటికీ రూ.4 నష్టమే!: చమురు వ్యవహారాల మంత్రి | Oil companies losing Rs 4 per litre on diesel says Hardeep Singh Puri | Sakshi
Sakshi News home page

డీజిల్‌పై ఇప్పటికీ రూ.4 నష్టమే!: చమురు వ్యవహారాల మంత్రిహర్‌దీప్‌ సింగ్‌ పురి

Published Thu, Nov 3 2022 6:34 AM | Last Updated on Thu, Nov 3 2022 10:28 AM

Oil companies losing Rs 4 per litre on diesel says Hardeep Singh Puri - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్‌ కంపెనీలు (ఓఎంసీ) డీజిల్‌పై లీటరుకు ఇప్పటికీ రూ.4 చొప్పున నష్టపోతున్నాయని కేంద్ర చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి బుధవారం పేర్కొన్నారు. అయితే పెట్రోల్‌ విషయంలో కంపెనీల మార్జిన్లు సానుకూలంగానే ఉన్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు తగ్గిన నేపథ్యంలో దేశంలో కూడా చమురు ధరలు తగ్గించాలన్న డిమాండ్‌ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

► ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత పెట్రోల్, డీజిల్‌ ధరలను అదుపు చేయడంసహా దేశంలో ద్రవ్యోల్బణం పెరక్కుండా ప్రభుత్వ పోరాటానికి సహాయం చేయడానికి చమురు మంత్రిత్వశాఖ తగిన ప్రయత్నాలన్నింటినీ చేస్తుంది. ఈ విషయంలో  ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌)లతో కలిసి పనిచేస్తుంది. అవసరమైతే చమురు కంపెనీలకు వచ్చే నష్టాలకు ప్రభుత్వ నుంచి ఆర్థికపరమైన సహాయాన్నీ కోరుతుంది.  
► జూన్‌ 2020 నుండి ప్రారంభమైన రెండేళ్ల కాలంలో దేశీయ వంట గ్యాస్‌ (ఎల్‌పీజీ) అమ్మకంపై వచ్చిన నష్టాలను పూడ్చేందుకు ప్రభుత్వం గత నెలలో మూడు సంస్థలకు రూ.22,000 కోట్లను ఒకేసారి గ్రాంట్‌గా అందించింది. అయితే రూ.28,000 కోట్లు ఇవ్వాలని చమురు మంత్రిత్వశాఖ కోరింది.  
► అండర్‌ రికవరీ  (రిటైల్‌ అమ్మకపు ధర– అంతర్జాతీయ ధర మధ్య వ్యత్యాసం)  ప్రస్తుతం డీజిల్‌పై లీటరుకు రూ. 27 ఉంది. అయితే వాస్తవిక నగదు నష్టం (ముడి చమురు సేకరణ–ఇంధనంగా మార్చడం వల్ల కలిగే వాస్తవ వ్యయ ఆధారిత నష్టం) లీటరుకు ఇప్పటికీ దాదాపు రూ. 3–4గా ఉంది.  
► మూడు ఇంధన రిటైల్‌ కంపెనీలు ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో రూ. 19,000 కోట్లకు పైగా నికర నష్టాన్ని చవిచూశాయి. తదుపరి త్రైమాసికంలో కూడా నష్టాలను ఎదుర్కొంటాయన్న అంచనా ఉంది.  
► భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురు బాస్కెట్‌ ధర జూన్‌లో బ్యారెల్‌కు  116 డాలర్ల వరకు పెరిగింది, అయితే నవంబర్‌ నెలలో 92.25 డాలర్లకు తగ్గింది.


తగ్గిస్తే... మే తర్వాత మొదటిసారి
ద్రవ్యోల్బణం నియంత్రించడం, వినియోగదారులపై ధరల భారం తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం డీజిల్, పెట్రోల్‌పై ఈ ఏడాది మే ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. దీనితో వ్యవస్థలో ఆ నెల్లో పెట్రోల్, డీజిల్‌ ధరలూ తగ్గాయి.  మళ్లీ ధరలు తగ్గిస్తే అది మే తర్వాత మొదటిసారి అవుతుంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్‌ ధరలను ప్రతిరోజూ సవరించాలి.  అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు మే తర్వాత ఈ సరవణలు చేయడం లేదు. అంతర్జాతీయ ధరల తీవ్రత నేపథ్యంలో మే నెల్లో ధరలు తగ్గింపునకు ముందు పెట్రోల్, డీజిల్‌ ధరలు రూ.10 వరకూ పెరిగాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement