● రూ.100 కోట్ల రూ.2 వేలు నోట్లను మార్చేందుకు డీల్ ● బేరం కుదరకపోవడంతోనే ఆదాయ పన్ను శాఖ అధికారులమంటూ కిడ్నాప్‌కు యత్నం ● పోలీసుల గస్తీతోకుటుంబాన్ని వదిలేసిన నిందితులు ● 12 మందిపై కేసు నమోదు.. ఏడుగురి అరెస్టు ● పరారీలో ముగ్గురు నిందితులు ● పలమనేరు డీఎస్పీ ప్రభాకర్
కుప్పం: రైస్ పుల్లింగ్ స్మగ్లింగ్ వల్ల భారీ నగదు పంపకాల్లో వచ్చిన విభేదాలతో కొందరు యువకులు ముఠాగా ఏర్పడి ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఏడుగురిని అరెస్టు చేసినట్లు కుప్పం ఇన్‌చార్జ్ డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. కుప్పం రూరల్ సీఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఇటీవల ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రామకుప్పం మండలం పెద్దకురబలపల్లికి చెందిన గోవిందప్ప తమ్ముడు జయరఘురాం రైస్ పుల్లింగ్ చేసేవాడు. ఈ నేపథ్యంలో జయరఘురాంకు రూ.2 వేలు నోట్లు రూ.100 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఈ నగదు మార్చి ఇస్తే 50 శాతం నగదు ఇస్తామని బెంగళూరుకు చెందిన స్వర్ణలతతో ఒప్పందానికి ప్రయత్నించాడు. అయితే అది కుదరకపోవడంతో బెంగళూరుకు చెందిన స్వర్ణలత, నవీన్‌కుమార్, రామకుప్పం మండలం జౌకుపల్లికి చెందిన సుబ్రమణ్యం కలిసి గోవిందప్ప కుటంబాన్ని కిడ్నాప్ చేసేందుకు తిరుపతికి చెందిన అరుణ్‌కుమార్‌కు వాహనం ఇచ్చి పురమాయించారు. గత గురువారం అర్ధరాత్రి గోవిందప్ప ఇంటికి వెళ్లి తాము ఆదాయ పన్ను శాఖ అధికారులమని నమ్మించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసుల గస్తీ వల్ల కిడ్నాపర్లు గోవిందప్ప కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్లారు. ఈ కేసు పూర్తి దర్యాప్తు అనంతరం 12 మంది నిందితులపై కేసు నమోదు చేసి ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రామకుప్పానికి చెందిన సుబ్రమణ్యం, బెంగళూరుకు చెందిన నవీన్ కుమార్, అరుణ్ కుమార్, కడపకు చెందిన వరప్రసాద్, శివశంకర్, ఖాదర్‌బాషా , మదర్‌వళ్లీ అనే వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు చెప్పారు. సమావేశంలో కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, ఎస్‌ఐలు శ్రీనివాసులు, నరేష్, వెంకటమోహన్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment