బయట పడుతున్న ‘నకిలీ’ నిందితులు
● తాజాగా కుప్పంలో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ● లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు
కుప్పం: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో నకిలీ పట్టాల బాగోతం రోజుకో మలుపు తిప్పుతోంది. ఇటీవల గుడుపల్లె మండలంలో బయటపడిన నకిలీ పట్టాల వ్యవహారంపై పోలీసు యంత్రాంగం దర్యాప్తు ముమ్మరం చేసింది. గత వారం రోజులుగా పోలీసులు జిరాక్సు సెంటర్లపై ప్రత్యేకంగా నిఘా వేశారు. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట గుడుపల్లె మండలం కోటచెంబగిరి గ్రామానికి చెందిన జగదీష్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించిన విషయ తెలిసిందే. అదే తరహాలోనే గుడుపల్లె మండలం కంచిబందార్లపల్లెకు చెందిన మురుగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. గురువారం పట్టణంలోని సబ్ రిజిస్ట్రారు కార్యాలయం సమీపంలో డాక్యుమెంటు రైటర్ కార్యాలయాల వద్ద ఓ జిరాక్సు సెంటర్ యాజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ జిరాక్సు సెంటర్‌లో రెవెన్యూ శాఖకు సంబంధించి రబ్బరు స్టాంపులు, కొన్ని నకిలీ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో డాక్యుమెంటు రైటర్ల కాంప్లెక్సులో కూడా నకిలీ పట్టాల తయారీపై పోలీసులు మరో కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా రెవెన్యూ శాఖ పరిధిలోని గ్రామ కంఠాలపై అనుభవ ధ్రువపత్రాలు విచ్ఛలవిడిగా పంపిణీ జరిగి రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేసినట్లు సమాచారం. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ కొనసాగిస్తుండడంతో నకిలీ పట్టాల అంశం ఆసక్తికరంగా మారింది.
మరింత మందిపై నిఘా..
సాధారణంగా డీకేటీ భూములు అనుభవిస్తున్న వారిని ప్రభుత్వ అధికారులు గుర్తించి డీ.ఫారం పట్టా అందజేస్తారు. కుప్పం నియోజకవర్గంలో 54 శాతం వ్యవసాయ పొలాలు, గుట్ట పొరంబోకు భూములు అధికంగా ఉన్నట్లు రెవెన్యూ శాఖ గతంలో వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే గుట్ట పొరంబోకును అనుభవిస్తున్న రైతులకు డి.పట్టాల ఇచ్చేందుకు ఓ ముఠా సిద్ధపడింది. ప్రత్యేకంగా నకిలీ పట్టాలను సృష్టిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు అరెస్టు
గుడుపల్లె: నకిలీ డీపట్టాలకు సంబంధించిన వ్యవహారంలో మరో ఇద్దరు మురుగేష్, గుణశీలన్‌ను గురువారం అరెస్టు చేశామని ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని కంచిబందార్లపల్లెకు చెందిన రాజప్ప పేరిట ఉన్న 1.64 ఎకరాల భూమిని ఆన్‌లైన్‌లో తన భార్య లక్ష్మి పేరిట మార్చాలని వెంకటేష్ అనే వ్యక్తి మురుగేష్‌ను కోరాడు. దీంతో మురుగేష్ కుప్పం పటణంలోని వెన్నెల కంప్యూటర్ సెంటర్ నడుపుతున్న తన స్నేహితుడు గుణశీలన్ వద్దకు వెళ్లి నకిలీ వన్‌బీ నమూనా, అనుభవ ధ్రువీకరణ సృష్టించి ఇచ్చారు. ఇందులోనే 144 శెట్టిపల్లె సీల్ వేసి రైతు వెంకటేష్ దగ్గర నుంచి రూ.5 వేలు తీసుకున్నాడు. అయితే కొన్ని రోజుల తరువాత ఈ భూమి ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో వెంకటేష్ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. ఈ నేపథ్యంలో బాధితుడు వెంకటేష్ తన భార్య లక్ష్మితో కలిసి గత నెల 26వ తేదీన తమ భూములు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీనిపై క్షేత్రస్థాయిలో తహసీల్దార్ సీతారాం విచారణ చేపట్టగా.. వారిది నకిలీ డీపట్టా అని తేల్చారు. ఆయన ఫిర్యాదు మేరకు గత కొన్ని రోజులుగా నకిలీ డీపట్టాల వ్యవహారంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా మురుగేష్, గుణశీలన్‌ను అరెస్టు చేశారు. ఇంకా ఇలాంటి ముఠాలు ఉన్నారా ? అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment