పరువుపోయె కదా..!
చిత్తూరు అర్బన్: జిల్లాలోని చాలా మండలాల్లో తహసీల్దార్ల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. రెగ్యులర్ తహసీల్దార్లను నియమించకపోవడం.. ఇన్‌చార్జ్‌లకు పాలన అప్పగించడంతో వారు ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా, వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుండడంతో రెవెన్యూ శాఖ గాడి తప్పుతోంది. పలు మండలాల్లో రెగ్యులర్ తహసీల్దార్లు ఉన్నప్పటికీ, అధికారపార్టీ నాయకులు రెవెన్యూ వ్యవస్థలో కలుగజేసుకుని వారికి అనుకూలంగా ఉండేవారిని ఇన్‌చార్జ్‌లుగా తెచ్చుకుని ఆయా మండలాల్లో భూ వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేలకు తెలియకుండా పలువురు తహసీల్దార్లు రికార్డుల్లో పెన్ను కూడా పెట్టడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో కార్వేటినగరం, శ్రీరంగరాజపురం, పెనుమూరు, పలమనేరులో నియోజకవర్గంలో గంగవరం, పెద్ద పంజాణి మండలాల్లో ఇప్పటికీ ఇన్‌చార్జ్ తహసీల్దార్లే పెత్తనం చెలాయిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా చాలా మండలాల్లో ఇన్‌చార్జ్ తహసీల్దార్ల పాలన
అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పనిదే సంతకం కూడా పెట్టరు
భూ దందాలు.. సెటిట్‌మెంట్లకే ప్రాధాన్యం
తహసీల్దార్ అంటే ఒకప్పుడు ఆ గౌరవమే వేరు. మండలం మొత్తానికి మేజిస్ట్రేట్. వారికి చట్టంలోని నిబంధనలపై అవగాహన ఉండేది. హుందాగా వ్యవహరించాలి. పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యలు పరిష్కరించాలి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక తహసీల్దార్ అనే మాటకే కొందరు అధికారులు కళంకం తెచ్చిపెడుతున్నారు. అర్హత లేనివారిని రాజకీయ ఒత్తిళ్లతో అందలం ఎక్కిస్తుండడంతో వ్యవస్థ దారి తప్పుతోందనే మాటలు వినిపిస్తున్నాయి.
ఎక్కడికక్కడ దళారులు..
ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పారదర్శకత వహించాల్సిన తహసీల్దార్లలో చాలామంది వ్యక్తిగత లబ్ధి కోసం పాటు పడుతున్నారు. చాలాచోట్ల ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టేందుకు దళారులను నియమించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ దళారులకు కొందరు సిబ్బంది సహకరిస్తుండడంతో రెవెన్యూ వ్యవస్థ అవినీతి ఊబిలో చిక్కుకుంది. చిత్తూరులో తహసీల్దార్‌గా పనిచేసిన ఓ అధికారి గతంలో తిమ్మసముద్రం వద్ద పేదల కోసం కేటాయించిన లేఅవుట్‌లో 12 పాట్లను అమ్ముకుని వెళ్లి.. ఇప్పుడు కలెక్టరేట్‌లోనే పని చేసుకుంటున్నాడు. ఈ వ్యవహారంపై కలెక్టర్‌కు ఫిర్యాదు అందడంతో విచారణ జరుపుతుండగా, ఆ అధికారిపై వేటు ఖాయంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment