అంతా మంచి జరగాలి
పుంగనూరు/నగరి: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రజలకు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలంతా తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. అలాగే కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
స్వయంప్రతిపత్తి
సాధించడం గర్వకారణం
కుప్పం రూరల్: కుప్పం ఇంజినీరింగ్ కళాశాల స్వయంప్రతిపత్తి(అటానమస్) సాధించడం గర్వకారణమని జేఎన్‌టీయూఏ వైస్ చాన్స్‌లర్ హెచ్.సుదర్శనరావు తెలిపారు. మంగళవారం కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కళాశాల బ్రౌచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం ఇంజినీరింగ్ కళాశాల ఉత్తమ ప్రమాణాలు పాటిస్తోందని, మారుతున్న కాలానుగుణంగా సాంకేతిక విద్యను విద్యార్థులకు అందించడం శుభసూచకమన్నారు. గ్రామీణ ప్రాంతమైన కుప్పంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత బీసీఎన్ విద్యాసంస్థల అధినేత బీసీ నాగరాజుకే దక్కిందన్నారు. అనంతరం ఆయన 2025 సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్‌బాబు, అధ్యాపకులు ఉన్నారు.
పెనుమూరు రైతులకు ప్రశంసలు
పెనుమూరు(కార్వేటినగరం): కేంద్ర వ్యవసాయ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింహచౌహాహన్ పెనుమూరు రైతులను ప్రశంసించారు. మంగళవారం తిరుపతిలోని రాస్ విజ్ఞాన కేంద్రంలో రైతుల సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పెనుమూరు మండలానికి చెందిన జామ సాగు చేసే రైతు పసపల హరికృష్ణారెడ్డి, పూలసాగు రైతు వీరభద్రను కేంద్రమంతి అభినందించారు. జామ సాగు దిగుబడి, రాబడిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పూల తోట సాగు చేసిన రైతు మాట్లాడుతూ తాను ఏటా రూ.4 లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఆదాయం పొందుతానని వివరించాడు. అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ రైతులు పండ్లు, పూలను అద్భతంగా పండించారని కొనియాడారు. ఈ క్రమంలో భాగంగా జామ రైతు హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాలని, జిల్లాలోని మామిడి, జామ, టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మంత్రికి విన్నవించారు. కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, రాస్ కేవీకే డైరెక్టర్ శ్రీనివాసులునాయుడు, శాస్త్రవేత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదుల విధుల బహిష్కరణ
చిత్తూరు అర్బన్: న్యాయవాదుల పట్ల పోలీసుల వైఖరిని నిరసిస్తూ చిత్తూరు జిల్లావ్యాప్తంగా న్యాయవాదులు మంగళవారం విధులను బహిష్కరించారు. అనంతపురం జిల్లాలో న్యాయవాది శేషాద్రితో పోలీసులు స్టేషన్‌లో దురుసుగా ప్రవర్తించడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారని.. అలాగే హైకోర్టు న్యాయవాది జల్లా సుదర్శన్‌రెడ్డి పట్ల లక్కిరెడ్డిపల్లె పోలీసులు వ్యవహరించిన తీరును న్యాయవాదులు తప్పుబట్టారు. ఈ ఘటనలను నిరసిస్తూ చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని న్యాయవాదులు విధులను బహిష్కరించారు. చిత్తూరు బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాజేంద్రరెడ్డి, అశోక్ ఆనంద్ యాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment