హిందూ ధర్మ ప్రచార రథం ప్రారంభం
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన ప్రచార రథాన్ని సోమవారం ప్రారంభించారు. హిందూ ధర్మ ప్రచారం నిమిత్తం ఉద్దేశించిన ఈ ప్రచార రథంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం ఈఓ పెంచల కిషోర్ మాట్లాడుతూ, జిల్లాలోని మారుమూల గ్రామాలకు ధర్మ ప్రచార రథం వెళుతుందన్నారు. అక్కడ స్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఈఓ రవీంద్రబాబు, సిబ్బంది కోదండపాణి, బాలాజీనాయుడు తదితరులు పాల్గొన్నారు.
నేడు మొగిలిలో ప్రచార రథ సేవ..
బంగారుపాళెం మండలంలోని మొగిలిలో మంగళవారం ప్రచార రథ సేవ నిర్వహిస్తామని ఈఓ పెంచలకిషోర్ తెలిపారు. సాయంత్రం 5 గంటలకు మొగిలీశ్వరస్వామి దేవస్థానం వద్ద ప్రచార రథానికి పూజలు జరుగుతున్నాయన్నారు. సనాతన ధర్మ సూత్రాలు, నైతిక విలువలు, ఆలయ పవిత్రతపై స్థల పురాణంపై భక్తులకు తెలియపరుస్తారన్నారు. అలాగే ప్రవచనాలు, భజనలు, కోలాటం, చెక్క భజన, భక్తి గీతాలు, గోపూజ, కల్యాణోత్సవం నిర్వహిస్తారని పేర్కొన్నారు.
యువకుడి ఆత్మహత్య
పుంగనూరు: పట్టణంలోని ప్రముఖ వ్యాపారి రమేష్‌బాబు కుమారుడు చంద్రశేఖర్(30) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రశేఖర్ ప్రతి రోజు తమ చింతగింజల ఫ్యాక్టరీని పర్యవేక్షించేవాడు. ఇలా ఉండగా మధ్యాహ్నం వెళ్లిన చంద్రశేఖర్ ఫ్యాక్టరీలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిని గమనించిన ఫ్యాక్టరీలో పని చేసే వారు వెంటనే చంద్రశేఖర్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. శవాన్ని పోస్టుమార్టానికి తరలించి, ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment