దళితులకు రక్షణ కల్పించాలి
నగరి : మండలంలోని తడుకుపేట దళితులపై దాడి చేయడమే కాకుండా వారి వాహనాలు త గలపెట్టిన అగ్రకులస్తులపై చర్యలు తీసుకుని దళితులకు రక్షణ కల్పించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాంజీవరం సురేంద్రన్, అన్నూరి ఈశ్వర్ డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం తడుకు దళితవాడకు వెళ్లిన వారు బాధిత దళితులను పరామర్శించి, వారిలో చైతన్యం నింపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందన్న అహంకారంతో దళితులు గ్రామం వదిలి వెళ్లిపోవాలని ఆంక్షలు విధించడం తగదన్నారు?. గొడవలు సద్దుమణిగినా రకరకాల పద్ధతుల్లో రాజకీయ కక్షలతో దళితులను బలి చేయడం దుర్మార్గమైన కుల దురహంకార చర్య అన్నారు. దళితుల పిల్లలు స్కూలుకు రాకూడదని బయటకు పంపడం సిగ్గు చేటన్నారు. గుడిలోకి రాకూడదని, రకరకాల పద్ధతులు అంక్షలు పెట్టడం దుర్మార్గమన్నారు. మహిళలకు రక్షణ లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి రాష్ట్రానికే అవమానకరమన్నారు. రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమైనప్పటికీ దళితులపై వివక్ష చూపడం సిగ్గుచేటన్నారు. దెబ్బలు తగిలి ఆస్పత్రిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. సమస్యలను రాజకీయాలకు ముడిపెట్టి దళితులకు మహిళలకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కేసులు దళితులపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెరుమాళ్, షణ్ముగం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment