ఎస్‌ఐ తీరుపై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు
శాంతిపురం: ఎస్‌ఐ తనను బెదిరించి, దుర్భాషలాడినా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఓ యువకుడు జాతీయ మానవహక్కుల కమిషన్, రాష్ట్ర లోకాయుక్తలను ఆశ్రయించాడు. శాంతిపురం మండలంలోని అబకలదొడ్డి పంచాయతీ గంగాపురానికి చెందిన ఎన్‌వీ సురేష్ కథనం మేరకు.. జంగాలపల్లికి చెందిన తన మిత్రుడి కుమారుడు కనిపించడం లేదని బాధితులు గత నెలలో రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పురోగతిని తెలుసుకునేందుకు బాధిత కుటుంబంతో కలసి గత నెల 24వ తేదీ తాను పోలీసుస్టేషన్ వద్దకు వెళ్లాడు. అక్కడ స్టేషన్ ఎదుట సురేష్‌ను చూసిన ఎస్‌ఐ నరేష్ అందరి ముందే అసభ్యు పదజాలంతో దూషిస్తూ, ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించాడు. దీన్ని వీడియో తీసే ప్రయత్నం చేసిన సురేష్ నుంచి కానిస్టేబుల్ బీఆర్ నాయక్ ఫోన్ బలవంతంగా లాక్కుని వీడియోను డిలీట్ చేశాడు. ఈ వ్యవహారంపై అదే రోజు బాధితుడు కుప్పం డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. గతంలో తమిళనాడు నుంచి కర్ణాటకకు అక్రమ బియ్యం రవాణాపై ఎస్‌ఐకి ఫిర్యాదు చేసినందుకే ఇలా చేశాడని పేర్కొన్నాడు. తనను, తన తల్లిని అవమానించేలా మాట్లాడి, తన ప్రాణాలు తీస్తానని బెదిరించిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డీఎస్సీని కోరాడు. తర్వాత ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వారిని డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి ఎస్‌ఐ దౌర్జన్యాన్ని విచారణ చేసుకున్న అధికారులు తదుపరి చర్యలు తీసుకోలేదు. పైగా తనకు జరిగిన అన్యాయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పాపానికి నిత్యం పోలీసుస్టేషన్ దగ్గరకు వెళ్లి అక్కడికి వచ్చే ప్రజల నుంచి పోలీసుల పేరు చెప్పి డబ్బులు చేస్తున్నానని తనపై అభాండాలను వేస్తున్నారని వాపోయాడు. అందుకే గత ఆరు నెలలుగా పోలీసు స్టేషన్‌లోని అన్ని సీసీ కెమెరాల్లో నమోదైన వీడియో రికార్డింగుల కాపీ కోసం సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నానని చెప్పాడు. జిల్లా ఎస్పీతో పాటు పోలీసు శాఖలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోయిందన్నాడు. దీంతో న్యాయం కోసం జాతీయ మానవహక్కుల కమిషన్, లోకాయుక్తలను ఆశ్రయించినట్టు చెప్పాడు. రెండు విచారణ సంస్థలు తన ఫిర్యాదులను విచారణకు స్వీకరించినట్టు బాధితుడు తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ తన ఆవేదనను 2809/సీఆర్/2025గా, లోకాయుక్త 141/2005గా నమోదు చేశాయని వివరాలను విలేకరులకు వెల్లడించాడు. బహిరంగంగా తన ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించి, ప్రాణాలు తీస్తానని బెదిరించిన ఎస్‌ఐపై న్యాయ పోరాటం కొనసాగిస్తానని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment