‘సూపర్ సిక్స్’ను భోగిమంటల్లో కాల్చేశారు!
నగరి : కూటమి సర్కారు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను భోగిమంటల్లో కాల్చేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్కే రోజా ఆరోపించారు. సోమవారం నగరిలోని తన నివాసంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి భోగి సంబరాలు జరుపుకున్నారు. భోగి మంటల చుట్టూ కుటుంబసభ్యులతో కలిసి భోగి పాటలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. ప్రజల జీవితాల్లో భోగిభాగ్యాలు నిండాలని, భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటేనే మరింత ఆనందంగా ఉంటుందని, ఆయుష్షు కూడా పెరుగుతుందన్నారు. బంధువుల మధ్య బంధుత్వాలు పెంచే పండగే సంక్రాంతి అన్నారు. పల్లె వాతావరణంలో పండుగలు జరుపుకోవడం మన సంస్కృతికి నిదర్శనమన్నారు. గత ఐదేళ్లలో సంక్రాంతి కాంతులు ప్రజల్లో కనిపించేవన్నారు. నేడు ప్రజలు తాము ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలను భోగి మంటల్లో కాల్చేశారన్నారు. సంక్రాంతి అంటేనే రైతులు పండగని ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రైతు సాగు చేసిన పంటలకు బీమా లేదన్నారు. గిట్టుబాటు ధర కూడా దక్కలేదన్నారు. ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంటే డిప్యూటీ ిసీఎం క్షమాపణలు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. హిందుత్వ పార్టీ కూటమిలో ఉన్నా తిరుపతి తొక్కిసలాట సంఘటనకు కారణమైన వారిని అరెస్టు చేయలేదన్నారు. బాధిత కుంటుంబలకు టీటీడీ ఇచ్చే ఎక్స్ గ్రేషియాతో పాటు ప్రభుత్వం కూడా ఎక్స్ గ్రేషియ ఇవ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment