క్లబ్బూ మాదే.. డబ్బూ మాకే..!
● చిత్తూరులో వీధి వీధికీ పేకాట క్లబ్బులు ● రూ.కోట్లలో టర్నోవర్ ● నెలసరి మామూళ్లతో అనుమతులిస్తున్న ఖాకీలు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో పేకాట క్లబ్‌లు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. నగరంలోని సంతపేట, వన్నియర్ బ్లాక్, తేనబండ, కట్టమంచి, రామ్‌నగర్ కాలనీ, గిరింపేట, కొంగారెడ్డిపల్లె, కై లాసపురం, సత్యనారాయణపురం, దుర్గానగర్ కాలనీ, హై రోడ్డులోని ఓ సిమెంట్ దుకాణం, గంగనపల్లె, బాలాజీ కాలనీ, ముత్తిరేవుల, పూనేపల్లె, దొడ్డిపల్లె, కట్టెలదొడ్డి ప్రాంతం, కాణిపాకం బైపాస్‌లోని ఓ దాబా ప్రాంతాల వద్ద పేకాట క్లబ్‌లు నడుస్తున్నాయి. వీటిల్లో ప్రధానంగా సాగుతున్న జూదం లోపల–బయట. గంటల్లో ఒక్కొక్కొరు రూ.లక్షల్లో పోగొట్టుకోవడం, మరికొందరు రూ.లక్షలు రాబట్టుకోవడం జరుగుతోంది. నెలకు రూ.కోట్లలో టర్నోవర్ జరుగుతోంది.
భారీ ఆదాయం..
ఈ క్లబ్‌లు నిర్వహిస్తున్న వారంతా కూటమి పార్టీకి చెందిన వారే. మరికొందరు గతంలో వైఎస్సార్‌సీపీలో ఉంటూ ఇప్పుడు కూటమిలో కొనసాగుతున్న వారూ ఉన్నారు. కొందరు కార్పొరేటర్ స్థాయి, వార్డు ఇన్‌చార్జ్‌లు, మహిళా కార్పొరేటర్లకు చెందిన పతులు కూడా ఉన్నారు. రోజుకు రూ.30 వేల వరకు క్లబ్ నిర్వహణ వ్యయంగా వసూలు చేస్తున్నారు. డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తికి ఎలాంటి పూచీకత్తు లేకుండా అప్పటికప్పుడే డబ్బులు ఇచ్చే వాళ్లూ ఉన్నారు. రూ.లక్ష ఇస్తే సాయంత్రంలోపు రూ.1.20 లక్షలు ఇచ్చేయాలి. అంటే రోజుకు రూ.లక్షకు రూ.20 వేలు వడ్డీ అన్నమాట. ఇలా వడ్డీలకు ఇచ్చే వ్యక్తులు, క్లబ్ నిర్వహకులకు రూ.20 వేలు చెల్లించాలి.
చర్యలు తీసుకుంటాం..
పేకాట ఎక్కడెక్కడ ఆడుతున్నారో ఎవరైనా సమాచారం ఇస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మా వాళ్లు ఎవరైనా తప్పు చేస్తే, వారిపైనే సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఎక్కడైనా పేకాట ఆడుతున్నా డయల్–100, పోలీసు వాట్సప్–9440900005, నా నంబర్ 9440796704 కూడా ఫోన్ చేసి చెప్పండి. సమాచారం ఇచ్చిన వాళ్ల వివరాలు రహస్యంగా ఉంచుతాం. – సాయినాథ్, డీఎస్పీ, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment