పాలిటెక్నిక్‌తో పక్కాగా ఉపాధి
కుప్పంరూరల్ : పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి కాగానే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు వెతుక్కుకుంటూ వస్తాయని కుప్పం పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ జగన్నాథరావు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని బాలికల పాఠశాలలో పాలిటెక్నిక్ కోర్సులపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతిక రంగంలో పరిశ్రమలను అనుసంధానం చేస్తూ కోర్సులను బోధిస్తున్నామన్నారు. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని వెల్లడించారు. కుప్పం కళాశాలలో ఉచిత పాలిసెట్ కోచింగ్, స్టడీ మెటీరియల్ సైతం అందిస్తున్నట్లు వివరించారు. పాలిసెట్–2025 ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను పది పాసైన, పది పరీక్షలు రాసిన విద్యార్థులు రాయవచ్చనని సూచించారు. అనంతరం పాలిటెక్నిక్ ఎందుకు చదవాలి అనే అంశంపై తయారు చేసిన బ్రోచర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటేష్‌బాబు, పాలిటెక్నిక్ అధ్యాపకులు రమేష్, హుస్సేన్ మియామి పాల్గొన్నారు.
చిటిపిరాళ్ల హెల్త్ క్లినిక్ తనిఖీ
పూతలపట్టు(కాణిపాకం): పూతలపట్టు మండలం చిటిపిరాళ్లలోని విలేజ్ హెల్త్ క్లినిక్‌ను శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. వైద్య ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు చేపట్టిన వ్యాక్సినేషన్‌పై విచారించారు. టెలీ మెడిసిన్ విధానం ఎలా పనిచేస్తోందో ఆరా తీశారు. అలాగే హెల్త్ సెంటర్‌లో అందుతున్న వైద్య సేవలపై స్థానికులతో మాట్లాడా రు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ ప్రభావతి, డీఎంహెచ్‌ఓ సుధారాణి, జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్ పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేకం
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువ జామునే ఆలయం శుద్ధి చేసి విశేషంగా ముస్తాబు చేశారు. రాహుకాల సమయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకం జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లంచుకున్నారు. ఉభయకర్తలకు ఆలయ ఈఓ ఏకాంబరం తీర్థప్రసాదాలు అందజేశారు.
బాలికలకు పౌష్టికాహారం తప్పనిసరి
చిత్తూరు కలెక్టరేట్ : బాలికలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా అందించాలని ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి ఆదేశించారు. శుక్రవారం చిత్తూరులోని గిరింపేట నగరపాలక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ బాలిక దినోత్సవం నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ ఆడపిల్లలు మానసికంగా, శారీరకంగా ఎదగడానికి పౌష్టికాహారం ముఖ్యమన్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ఇద్దరినీ సమానంగా చూడాలని సూచించారు. బాలికలు తమ లక్ష్యాలను చేరుకునేందుకు తల్లిదండ్రులు సహకరించి ప్రోత్సహించాలని కోరారు. మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ విజయ్‌శేఖర్ మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో పిల్లలు సామాజిక మాధ్యమాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో మంచిని స్వీకరించి చెడును వదిలేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆడపిల్లని రక్షిద్దాం..ఆడపిల్లని చదివిద్దాం అంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పలు క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో సమగ్రశిక్ష శాఖ జీసీడీఓ ఇంద్రాణి, దిశా ఎస్‌ఐ నాగసౌజన్య, బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ ఆఫీసర్ వాసంతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment